బీజేపీ నుంచి గెలిచినా.. రత్నప్రభ వైసీపీలోకి వెళ్ళిపోవడం ఖాయం..’ అనే చర్చ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జోరుగా సాగుతోంది. అందరికంటే ముందే తిరుపతిలో హడావిడి మొదలు పెట్టి, అందరికన్నా లేటుగా అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి.. అంటూ మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను అనూహ్యంగా రంగంలోకి దించిన బీజేపీ, తిరుపతి ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ఇంకోపక్క, రత్నప్రభ మీద అత్యంత వ్యూహాత్మకంగా వైసీపీ కోవర్టు.. అనే ముద్ర వేసేస్తున్నారు కొందరు. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. గతంలో వైఎస్సార్ మీద ఆమె ప్రశంసలు కురిపించారు.. వైఎస్ జగన్ పాలన పట్ల కూడా అభినందనలు తెలిపారు. ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వ్యవహారాలు.. అంటే ఆన్ రికార్డెడ్ అన్న మాట. ఆనాటి ఆ వ్యవహారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన రత్నప్రభ, ఆ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ ద్వారా ప్రస్తావిస్తూ, తాను చిత్తశుద్ధితో పనిచేస్తాననీ, గతంలో తాను కొన్ని మంచి కార్యక్రమాల్ని అభినందించానే తప్ప, వైసీపీకి మద్దతిచ్చాననడం సబబు కాదని అంటున్నారు. రత్నప్రభ నిజానికి రాజకీయ నాయకురాలు కాదు. రాజకీయ నాయకులైతే ఎలాగైనా మాట్లాడేస్తారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఆమె అలవాటు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల ముందైనా రత్నప్రభను తిరుపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించి వుంటే.. ఆమె రాజకీయాలకు అలవాటుపడేవారే. ఆమె ఎటూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వుంటుంది గనుక, ప్రత్యర్థులు బీజేపీని దెబ్బకొట్టడానికి ఆమెను టార్గెట్ చేస్తున్నారు ‘వైసీపీ కోవర్టు’ అని. అలా అంటున్నవారిలో టీడీపీ, వామపక్షాలతోపాటు, వైసీపీ అలాగే జనసేన మద్దతుదారులైన నెటిజన్లు కూడా వుంటుండడం గమనార్హం.