Ys Jagan’s Govt : వైఫల్యాల్ని వైఎస్ జగన్ సర్కారు కప్పిపుచ్చుకుంటే ప్రమాదమే.!

Ys Jagan’s Govt :  తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్ళిన భక్తులు నానా అవస్థలూ పడుతోంటే, అదంతా విపక్షాల కుట్ర.. అనేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు కొందరు వైసీపీ నేతలు. మంత్రులు కూడా, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.
‘మేం అద్భుతమైన ఏర్పాట్లు చేసేస్తే.. భక్తులే బాధ్యతగా వ్యవహరించలేదు..’ అని టీటీడీ కూడా ఓ నిర్లక్ష్యపూరిత ప్రకటన చేసేసింది. చివరికి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అసలు విషయాన్ని చల్లగా చెప్పేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేయలేకపోయినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాత ఆధ్మాత్మిక కేంద్రం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచే కాదు, విదేశాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వస్తారు.
అంతటి ప్రముఖ దేవస్థానంలో టీటీడీ తరఫున కావొచ్చు, ప్రభుత్వం తరఫున కావొచ్చు.. వైఫల్యాలు అనేవి వుంటే, వాటిని ప్రభుత్వం హుందాగా అంగీకరించాలి తప్ప, విపక్షాలపై ఎదురుదాడికి దిగడం వల్ల ఉపయోగం లేదు. ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలోనూ వైసీపీ ఎదురుదాడి వ్యూహంతోనే సరిపెడుతోంది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో అయినా, మూడు రాజధానుల విషయంలో అయినా.. ఈ ఎదురుదాడి వ్యూహం వైసీపీ కొంప ముంచుతోందన్నది నిర్వివాదాంశం.