రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామితో పాటు మరో ఇద్దరిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరిలించింది న్యాయస్థానం. వీరంతా నవంబరు 18 వరకు వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. మహారాష్ట్రకు చెందిన రాయగఢ్ పోలీసులు ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో ఈయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు అర్ణబ్ గోస్వామిని అలీబాగ్ కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు.
కోర్టు హాల్‌లోకి వస్తూనే పోలీసులు తనను కొట్టారని ఆరోపించారు అర్ణబ్ గోస్వామి. న్యూస్ రూంలో అరిచినట్లుగానే కోర్టు హాల్లో స్వరం హెచ్చించి తన వాదన వినిపించారని సమాచారం. దీంతో కోర్టు మరోసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం అర్ణబ్‌ను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టును కూడా న్యాయస్థానం పరిశీలించింది.
పోలీసులు తన పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు అర్ణబ్ గోస్వామి. భౌతిక దాడి కూడా చేశారని ఆరోపించారు. ఈ తరుణంలో తన సహజమైన తీరులో స్వరం హెచ్చించి గట్టిగా వాదనలు వినిపించారు. ఈ తీరుతో నొచ్చుకున్న న్యాయమూర్తి సుతిమెత్తగా ఆయన్ని హెచ్చరించడంతో గోస్వామి మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఇక ఆతర్వాత గోస్వామి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… పోలీసు కస్టడీ అవసరం లేదని, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు తగిన ఆధారాలు న్యాయస్థానం ముందు సమర్పించలేదని వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం అర్ణబ్ గోస్వామితో పాటు ఫిరోజ్ షేక్, నితేశ్ శార్దాలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.