ప్రస్తుతం ఏపీలో జగన్ చెప్పిన ఒక పంచతంత్ర కథ హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ముసలాయన అంటూ చంద్రబాబునుద్దేశించి కామెంట్స్ చేస్తున్న జగన్.. మరోసారి అలానే సంబోదిస్తూ ఒక కథ చెప్పారు. తాజాగా రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చంద్రబాబు… మోడీతో స్నేహం కోసం ఎప్పుడు తాను సిద్ధమే అని చెప్పడంతోపాటు… తాను మారిపోయాను, తాను మంచివాడిగా అయిపోయాను, ఇంతకాలం వదిలేశాను కాని.. ఇకపై ప్రజలను కోటీశ్వరలను చేయడమే నా లక్ష్యం వంటి మాటలు చెప్పారు. ఈ విషయాలపై జగన్ ఒక పంచతంత్ర కథ చెప్పారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
అనగనగా అడవిలో ఒక పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్ గా తినేదట. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ ఆ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయాయి. కదలలేక ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుని.. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్ వేసుకుంది. దారిలో ఓ మడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. కడియం కావాలంటే నీటిలో ఉంది తీసుకోండి అంటూ ఊరించేది. ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది అని అందరూ నమ్మకుండా పోయారు.
కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. అని నమ్మబలికింది. దీంతో… కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ నగలపై ఆశతో మడుగులోకి ఆ నగలు తీసుకునే ప్రయత్నంలో నీట మునిగి పోయేవాళ్లు. దీంతో… వారిని పట్టుకుని చంపితినేసేది ఆ పులి!
ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. “వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్ని వెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట. నేను సీనియర్ ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు” అని సీఎం జగన్ చెప్పారు.
దీంతో…. ఈ కథ చెప్పి, దాని భావాన్ని, తాతపర్యాన్ని.. ఫైనల్ గా ఈ కథలోని నీతిని అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పారనే కామెంట్స్ ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి! వినిపిస్తున్నాయి!