తెలుగుదేశం పార్టీని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏమొచ్చింది.? దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురే లేదు.! కానీ, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అందుకు భిన్నం. తెలంగాణలో బీజేపీ తన ఉనికిని చాటుకుంటోంది. అధికార బీఆర్ఎస్‌కి ధీటుగా ఎదిగింది.
సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకే రెండో స్థానమని తేలుతున్నా, తెలంగాణలో బీజేపీ మాత్రం తమదే అధికారం అంటోంది. కాంగ్రెస్ పార్టీది మూడో స్థానమేనన్నది బీజేపీ వాదన. ప్రస్తుతం రెండో స్థానంలో వున్నాం.. ముందు ముందు మొదటి స్థానంలోకి వెళతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీకి, తెలుగుదేశం పార్టీ అవసరమైంది. అందుకే, రిపబ్లిక్ టీవీ ద్వారా చంద్రబాబుతో సయోధ్యకు రంగం సిద్ధం చేసుకుంది బీజేపీ. అదే సాయం వైసీపీ నుంచి కూడా పొందవచ్చు కదా.? అంటే, వైసీపీ ఆ స్థాయిలో తెలంగాణలో బీజేపీకి సహాయ సహకారాలు అందించలేదు. అసలు వైసీపీ, తెలంగాణలో లేదు.
టీడీపీ కూడా తెలంగాణలో పెద్దగా ఉనికిని చాటుకోలేకపోతోంది. అయినాగానీ, టీడీపీకి కొంత బలమైన ఓటు బ్యాంకు వుంది. అది, ప్రధాన రాజకీయ పార్టీల గెలుపోటముల్ని శాసించగలదు. ఈ కోణంలోనే చంద్రబాబుతో బీజేపీ జాతీయ నాయకత్వం మంతనాలు షురూ చేసిందట. ‘అబ్బే, ప్రస్తుతానికి పొత్తుల చర్చలేమీ లేవు..’ అని బీజేపీ చెబుతున్నా, చంద్రబాబూ అదే మాట చెబుతున్నా.. విషయం అయితే సుస్పష్టం.