కరోనా వైరస్.. ప్రమాదకరం. అందుకే, ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఏ దేశమూ ఆర్థికంగా చితికిపోవడానికి ఇష్టపడదు. అత్యంత వేగంగా ఎక్కువమందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది గనకనే.. ఇంతలా భయపడాల్సి వస్తోంది ప్రపంచ దేశాలన్నీ. అయితే, గతంతో పోల్చితే ఇప్పుడు కరోనా వైరస్ పట్ల మరీ అంతగా భయపడాల్సిన పనిలేదన్నది వైద్య నిపుణుల వాదన. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతూనే, మరీ మీడియాలో కథనాలు వినిపిస్తున్నంత స్థాయిలో భయపడటం వల్ల అనర్థాలు ఎక్కువగా జరుగుతాయని మీడియా చర్చా కార్యక్రమాల్లోనే వైద్యులు చెబుతున్నారు. అయినాగానీ, మీడియా ఛానళ్ళలో జర్నలిస్టులు.. వైద్యుల మాటల్ని టోన్ డౌన్ చేస్తూ, భయాందోళనలు కలిగించేలా వ్యవహరిస్తున్నారు.
దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షా పాతిక వేలకు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. లాక్ డౌన్ తప్పదా.? అన్నది వేరే చర్చ. పాక్షిక లాక్ డౌన్ అయితే దేశంలో పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముందు ముందు మరిన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితుల్ని చూడబోతున్నాం. ఇదంతా కేసుల తీవ్రతను తగ్గించడం కోసమే. అవసరమైతే తప్ప, రోడ్ల మీదకు రావొద్దని మాత్రమే వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించాలనీ, వ్యక్తిగత, సామాజిక బాధ్యతతో ప్రజలు వ్యవహరిస్తే కరోనా వైరస్‌ని జయించగలమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క వ్యాక్సినేషన్ విషయంలోనూ చాలా అనుమానాలు ప్రజల్లో వున్నాయి. లక్షలాదిమంది వ్యాక్సిన్లు వేయించుకోగా, కోట్లాది మంది ఇంకా వ్యాక్సినేషన్ పట్ల భయపడుతుండడం గమనార్హం. అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే, కరోనా వైరస్ నుంచి బయటపడటం పెద్ద కష్టమేమీ కాదు.