కరోనా బీభత్సం … మార్చి 31 వరకు స్కూల్స్‌ మూసివేత !

దేశంలో కరోనా మహమ్మారి జోరు మాములుగా లేదు. మళ్లీ ఒకప్పటి రోజులని గుర్తుకు తెస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర లో కరోనా బీభత్సం మాములుగా లేదు. మహారాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్, మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పుణే జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పుణే డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు తెలిపారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే తెరవాలని, ఫుడ్‌ డెలవరీలు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్‌కు ఈ ఆంక్షలు అడ్డుగారావని పేర్కొన్నారు. మరోవైపు పట్టణంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని ఆదేశించారు. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు. ‌

పుణే పట్టణంలో ఉన్న అన్ని రకాల పార్కులు సాయంత్రం వెళల్లో మూసివేయాలని, ఉదయం సమయాల్లో వాకర్స్‌ కోసం తెరవాలని కమిషనర్‌ సౌరభ్‌ రావు ఆదేశించారు. మాల్స్, మల్లీప్లెక్స్‌లకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన విషయాలపై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే పుణే నగరంలో కేసుల సంఖ్య పెరుగుతోందని, దీని కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు. ఇప్పటివరకు ముంబైలో 3,38,631 మంది కరోనా సోకగా, 11,515 మంది మరణించారు.