దేశంలో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కేంద్ర సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో కేసులు భారీగా వెలుగుచూస్తుండడం.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మునుపటి కంటే కేసులు పెరగడంతో రాష్ట్రాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లాయి. యువతకు, 45 ఏళ్లు పైబడిన వారిని కూడా టీకా కార్యక్రమం కిందకు తీసుకురావాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సైతం సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి తేవాలని తాజాగా కేంద్రానికి సిఫారసు చేసింది.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రమంత్రి జవడేకర్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ టీకా నిబంధనలను కేంద్రం మార్చేసింది. ఇన్నాళ్లు 45 ఏళ్లు వ్యాధిగ్రస్తులు .. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వేసుకోవాలని సూచించగా.. తాజాగా దాన్ని 45 ఏళ్లకు తగ్గించింది. 45 ఏళ్లు పైబడిన వారు అందరూ టీకా వేసుకోవడానికి అర్హులే. నమోదు చేసుకుంటే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకా వేస్తారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మొదటి దశలో పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేశారు. రెండో దశలో 60 ఏళ్లు దాటిన వారు.. దీర్ఘకాలిక రోగులకు వేశారు. ఇప్పుడు కరోనా తీవ్రమవుతున్న దశలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయడానికి రెడీ అయ్యారు. కాగా టీకా కార్యక్రమం దేశంలో కొనసాగుతోంది. మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది.