కరోనా సెకెండ్ వేవ్: మళ్ళీ లాక్ డౌన్ తప్పదా.?

corona-second-wave-seems-lockdown-again

corona-second-wave-seems-lockdown-again
ఎలాంటి అనుమానాల్లేవ్.. కరోనా సెకెండ్ వేవ్ దేశంలో మొదలైంది. ‘లాక్ డౌన్’ ఇదివరకటిలా మళ్ళీ వుండబోతోందా.? లేదా.? అన్నదే ప్రశ్న. ఏమో, గతంలో మాత్రం ‘లాక్ డౌన్’ గురించి ఊహించామా.? రాత్రికి రాత్రి పిడుగులా పడింది. ఇప్పుడూ అంతే కావొచ్చు.

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. కర్నాటకలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కాస్త అదుపులోనే కరోనా వున్నట్లు కనిపిస్తున్నా, ముందు ముందు పొరుగు రాష్ట్రాల ఎఫెక్ట్ కారణంగా కేసుల తీవ్రత అనూహ్యంగా పెరిగే ప్రమాదముంది. ‘రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలి. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలు చేపట్టాలి. వ్యాక్సిన్ రావడంతో చాలామందిలో నిర్లక్ష్యం పెరిగింది..’ అని కేంద్రం తాజాగా రాష్ట్రాలను హెచ్చరించింది. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విద్యా సంస్థలు తెరవడం, రాజకీయ పార్టీల కార్యక్రమాలు వెరసి.. కరోనా తీవ్రతకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభుత్వాలూ కారణమేనన్న విమర్శ వినిపిస్తోంది. అయితే, బాధ్యత మరిచిన ప్రజలూ కరోనా వైరస్ వ్యాప్తి పెరగడానికి కారణమన్నది నిర్వివాదాంశం.

అయితే, కరోనా తీవ్రత పెరిగినా గతంలోలా కఠినమైన లాక్‌డౌన్ వుండకపోవచ్చన్నది నిపుణుల వాదన. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేపట్టగలిగితే, కరోనా నుంచి ఉపశమనం పొందడానికి ఆస్కారమేర్పడుతుంది. ఇదిలా వుంటే, తెలంగాణలో విద్యా సంస్థల విషయమై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. మరీ, ముఖ్యంగా చిన్న పిల్లల స్కూళ్ళను కొంతకాలం తాత్కాలికంగా మూసివేస్తే ఎలా వుంటుందన్న దిశగా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.