‘రాష్ట్రాలు కోరాయ్.. అందుకే, కొన్ని వస్తువుల, సేవలకు సంబంధించి ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం జరిగింది.. ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే పన్నులు వసూలు చేస్తున్నారు. పన్ను ఎగవేతకు ఆస్కారం లేకుండా ఈ చర్యలు తీసుకున్నాం. జీఎస్టీ మండలిలో రాష్ట్రాలదే కీలక పాత్ర..’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సవరించిన జీఎస్టీ స్లాబుల గురించి పాఠం చెప్పారు.
ట్విట్టర్‌లో ఈ మేరకు నిర్మలా సీతారామన్ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్లేశారు. నిజానికి, దీన్ని ట్వీటోత్పాతనం అనాల్సిందే. రాష్ట్రాలు కోరినట్టే కేంద్రం అన్నీ చేసేస్తోందా.? అయితే, చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాయ్ కదా.? మరి, కేంద్రమెందుకు పట్టించుకోవడంలేదు.?
దేశంలో మెజార్టీ రాష్ట్రాలు, కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటా ఇవ్వడంలేదని ఆరోపిస్తోంటే, కేంద్రం పట్టించుకోదాయె. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా అడుగుతోంది. తెలంగాణ రాష్ట్రమేమో కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అడుగుతోంది.
విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకి చెయ్యాల్సినవేవీ కేంద్రం చెయ్యడంలేదు. కానీ, రాష్ట్రాలు కోరుతున్నాయంటూ జీఎస్టీ వంటి విషయాల్లో కేంద్రం తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసేసుకుంటోంది. ఇక్కడే వస్తోంది అసలు చిక్కు.
నిజానికి, జీఎస్టీ అసలు ఉద్దేశ్యం వేరు.. ఇప్పుడు అమలవుతున్న జీఎస్టీ వేరు. దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణిస్తోంది దేశ ప్రజానీకం. అయినాగానీ, నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోంది.