కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజులు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ, పెద్ద సినిమాలు మాత్రం మొహం చాటేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల విషయమై నడుస్తున్న పంచాయితీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నెలకొన్న కోవిడ్ గందరగోళం.. ఇలా పలు సమస్యల నడుమ పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో చాలా సస్పెన్స్ నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. పెద్ద సినిమాల్లో చాలావరకు సంక్రాంతి మీద ఆశలు పెట్టుకున్నాయి. మూడో వేవ్ వచ్చే అవకాశం కన్పించడంలేదు.. అది కాస్త ఊరటనిచ్చే అంశమే. కానీ, కరోనా కంటే, టిక్కెట్ల వ్యవహారమిప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద సమస్యలా మారుతోంది. చిన్న, ఓ మోస్తరు సినిమాలకు ఆ సమస్య పెద్దగా వున్నట్టు కనిపించడంలేదు. నిజానికి, ‘సీటీమార్’ కూడా ఓ మోస్తరు పెద్ద సినిమా కిందనే లెక్క. ‘టక్ జగదీష్’ ఓటీటీ బాట పట్టింది.. ‘సీటీమార్’ ధైర్యంగా థియేటర్లలోకి వచ్చింది.
దసరా సీజన్ వచ్చేస్తోన్న దరిమిలా, పెద్ద సినిమాలేమైనా రిస్క్ చేస్తాయా.? అంటే, ఆ ఛాన్స్ కనిపించడంలేదు. కానీ, ఎన్నాళ్ళిలా.? ఆయా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోన్న నిర్మాతల పరిస్థితేంటి.? పెద్ద సినిమాలు లేకపోతే, థియేటర్ల వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఎందుకంటే, పెద్ద సినిమాలతోనే థియేటర్లకు పండగ. అదే సమయంలో, టిక్కెట్ల విషయమై ఏపీలో తలెత్తిన గందరగోళం నేపథ్యంలో నిర్మాతలు కొందరు రిస్క్ చేయలేకపోతున్నారు. ‘మా’ ఎన్నికల మీదున్నంత ఫోకస్, సినీ నటులకి.. సినిమాల రిలీజులపై లేకపోవడం కాస్తంత ఆశ్చర్యం కలిగించే విషయమే. సమస్య పరిష్కారం కోసం పరిశ్రమ తరఫున ఓ బృందం లీడ్ తీసుకుని, ఏపీ ముఖ్యమంత్రిని కలిస్తే.. కొంతవరకు సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో.