Narendra Modi: మోదీ ఇమేజ్ పై కరోనా డ్యామేజ్..! గ్రాఫ్ పడిపోతోందా..?

Narendra Modi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఊహించని విపత్తులా విరుచుకుపడుతోంది. రోజుకు వేలల్లోకి పడిపోయిన కేసులు ఏకంగా 3లక్షలు దాటాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇంతటి తీవ్రతకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. ‘దేశంలో నమోదయ్యే ప్రతి కరోనా కేసుకు మోదీనే కారణం.. సెకండ్ వేవ్ ను ప్రధాని ఎదుర్కోలేక పోతున్నారు’ అంటూ ప్రియాంక గాంధీ విమర్శిస్తున్నారు. అన్నారు. ధీరోదాత్తంగా నిర్ణయాలు తీసుకునే ప్రధాని మోదీ కరోనా సమయంలో చూపాల్సిన చొరవ ఇది కాదని అంటున్నారు.

2014లో మోదీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఒక చాయ్ వాలా దేశానికి ప్రధాని కాకూడదా.. అనే నినాదమే బలమైన ప్రచారమై మోదీ దేశ ప్రధాని అయ్యేలా చేసింది. అదే సోషల్ మీడియాలో #ResingModi అనే నినాదం నేడు ట్రెండింగ్ లో ఉంది. కరోనాను ఎదుర్కోవడంలో దేశాన్ని సరైన దిశలో నడిపించలేదని మండిపడుతున్నారు నెటిజన్లు. భారత్ అవసరాలు చూడకుండా వ్యాక్సిన్ ఎగుమతి చేసిన మోదీ నిర్ణయంపై ప్రతిపక్షాలతో సహా అందరూ ప్రశ్నిస్తున్నారు. మొదటి వేవ్ తగ్గుతున్న దశలోనే వ్యాక్సిన్లు సిద్ధమవడం.. బ్రిటన్ ను స్ట్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేయడం జరిగింది. అప్పుడే దేశంలో సెకండ్ వేవ్ వస్తే.. అనే ఆలోచన మోదీ చేయలేదని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ ఉన్నా.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.

జనాభా ఎక్కువున్న దేశం మనది. ముందు చూపుతో దేశంలోని ఆసుపత్రులను సిద్ధం చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, వ్యాక్సిన్ తయారీకి ప్రోత్సాహాలు కల్పించి ఈ అయిదు నెలల్లో భారత్ ను సిద్ధం చేయడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారనేది ఆరోపణ. పరిస్థితి తీవ్రతతో మేల్కొన్న కేంద్రం వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలకు 400 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్లు సిద్ధంగా లేకుంటే దేశం పరిస్థితి ఎలా ఉండేదోననే ఊహే భయం కల్పిస్తోంది. ఆక్సిజన్ కొరత, రెమిడిసివర్ స్టాక్, వ్యాక్సిన్ డిమాండ్ తో.. రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒత్తిడులను తట్టుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ప్రస్తుత పరిస్థితికి మాత్రం మోదీనే టార్గెల్ అవుతున్నరనేది నిజం..!