కరోనా : అమరావతిలో లాక్‌డౌన్‌.. కానీ , వెలుగులోకి 926 పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్ర అమరావతిలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన రెండో రోజు మంగళవారం జిల్లాలో ఒకే రోజు అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 926 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

అమరావతిలో లాక్‌డౌన్‌.. అయినా 926 పాజిటివ్‌ కేసులు

ఇంతకు ముందు ఫిబ్రవరి 20న 727 కేసులు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు 9,069 కేసులు నమోదవగా.. 4,728 కేసులు ఈ నెల 17 నుంచి వెలుగు చూసినవే. జిల్లాలో మంగళవారం ఆరుగురు మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 471కు చేరింది. అమరావతిలో వారం రోజుల లాక్‌డౌన్‌ సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. మార్చి ఒకటి ఉదయం 8 గంటల వరకు అమలులో ఉండనుంది.

అత్యవసర దుకాణాలు మినహా ఇతర షాపులకు అనుమతి ఇవ్వడం లేదు. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్‌లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, ఆడిటోరియాలు మూసివేయడంతో పాటు మత కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదని అధికారులు పేర్కొన్నారు. పలు చోట్ల నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీస్‌ కమిషనర్‌ ఆర్తి సింగ్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.