Health Tips: చైనాలో పుట్టిన కరోనా వైరస్, అంతకంతకు విస్తరించి ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందింది. కొన్ని రోజులు విజృంభించి, తిరిగి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలలో తిరిగి ఇది ప్రభావం చూపిస్తోంది. ఇంకా కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తగ్గి పోలేదని డబ్ల్యూహెచ్వో కూడా హెచ్చరిస్తోంది. యూరప్, ఆసియాలోని కొన్ని దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనా కూడా కొన్ని ప్రాంతాలలో మరొకమారు కఠిన లాక్ డౌన్ ను అమలు చేస్తోంది.
భారతదేశ విషయానికొస్తే ఇప్పటికే మూడు వేవ్ లు పూర్తయి నాలుగవ వేవ్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేల, వైద్య నిపుణులు భారతదేశానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. భారతదేశంలో ఇప్పటికే అనేక మందికి కరోనా వైరస్ సోకి తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ పూర్తి అవడం వల్ల వైరస్ ప్రభావం జనాల మీద తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడు వేవ్ ల తర్వాత ప్రజలలో లో రోగ నిరోధక శక్తి తగ్గినా కూడా శరీరంలో ఉన్న హైబ్రిడ్ ఇమ్మునుటీ కరోనా నుండి కాపాడుతుందని వారు తెలియజేశారు. నాల్గవ వేవ్ వచ్చినా సరే ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మెజారిటీ ప్రజలకు మాస్క్ కూడా ధరించాల్సిన అవసరం ఉండదు అని వారు తెలియజేశారు.
వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు తెలియజేశారు. దేశంలో కొత్త వేరియంట్ల యొక్క ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు కరోనా యొక్క నమూనాలను పంపించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ మ్యూటేషన్ లు అధికంగా వస్తాయి అని, వీటిలో ఇప్పటికే వెయ్యి మ్యూటేషన్లు వచ్చాయని, కానీ అన్నిటికంటే ఐదు మ్యూటేషన్లు మాత్రమే డేంజర్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త మ్యూటేషన్ లను కనుక్కోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ తో పర్యవేక్షిస్తున్నట్టు వారు తెలిపారు. అయితే ఇప్పటికే 80 నుండి 90 శాతం మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారని, కొత్త వైరస్ మ్యుటేషన్లు వచ్చినప్పటికీ ఎక్కువ ప్రభావం చూపలేవని నిపుణులు తెలిపారు. విదేశాల్లో సంభవిస్తున్న ఎక్కువ మరణాలు కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారికి అని, అయినప్పటికీ దీని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.