కరోనా సంక్షోభం: ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది.?

Corona Crisis - Where Is The Money?

Corona Crisis - Where Is The Money?

కరోనా సెకెండ్ వేవ్ దేశంలో తగ్గుముఖం పట్టింది. దాంతో, జరిగిన నష్టంపై ఇప్పుడిప్పుడే లెక్కలేసుకోవడం షురూ అయ్యింది. ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలు తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వాలదేముంది.? ప్రజల నెత్తిన పన్నులు రుద్దేస్తాయి. వాటికి పెద్దగా సమస్య వుండదు. మరి, ప్రజల మాటేమిటి.? కరోనా దెబ్బకి దేశంలో ప్రజలు ఎంతలా విలవిల్లాడారు.? వారి భవిష్యత్తు ఏంటి.? ఔను, కరోనా దెబ్బకి జనం చాలా చాలా కోల్పోయారు.

కుటుంబ పెద్దని కోల్పోయినవారు కొందరు.. ఆరోగ్యాన్ని కోల్పోయినవారు కొందరు.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినవారు మరికొందరు. అసలు కరోనా దెబ్బకి ఇబ్బంది పడనివారు దేశంలో దాదాపుగా ఎవరూ లేరనొచ్చేమో. వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల నష్టం దేశానికి వాటిల్లింది.. అంటే, ఇక్కడ దేశ ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నామన్నమాట. లక్షలు ఖర్చయినా లెక్క చేయని కుటుంబాల గురించి కాదు మనం మాట్లాడుకుంటున్నది. సామాన్యుడి గురించి.

ఆస్తులమ్ముకుని లక్షలాది రూపాయల ఫీజుల్ని ప్రైవేటు ఆసుపత్రులకు కట్టినవారి గురించి. ఆ సొమ్ము అంతా ఏమైపోయింది.? ఎక్కడికి వెళ్ళింది.? రెమిడిసివిర్ ఇంజెక్షన్ రేటు.. 3 వేల నుంచి 65 వేల దాకా పలికింది. వాస్తవ ధర 3 వేలు మాత్రమే. మరి, అలా కొట్టేసిన 62 వేలు ఏమైపోయాయి.. ఒక్కో ఇంజెక్షన్‌కి సంబంధించి.? మరో ఇంజెక్షన్ వాస్తవ ధర దాదాపు 24 వేలు. అది రెండు మూడు లక్షల నుంచి నాలుగైదు లక్షల దాకా పలికింది. బ్లాక్ పంగస్ మందుల కోసం కూడా ఈ స్థాయిలోనే ఖర్చు చేయాల్సి వస్తోంది. జనం డబ్బు ఖర్చు చేశారు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

మరి, ఆ డబ్బు ఏమయ్యింది.? అదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రైవేటు ఆసుపత్రులు పండగ చేసుకున్నాయి.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి, న్యాయస్థానాల ఆదేశాలతో ప్రైవేటు ఆసుపత్రులు, తాము దోచేసిన సొమ్ముల్ని తిరిగి బాధిదులకు ఇచ్చాయా.? ఛాన్సే లేదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే, ప్రజలు ఖర్చు చేసిన డబ్బుని వెనక్కి తీసుకురాగలగాలి. కానీ, అంతటి చిత్తశుద్ధిని ప్రభుత్వాల నుంచి ఆశించలేం.