వివాహం అంటేనే ఇద్దరి నమ్మకం మీద కనసాగే బంధం. కానీ ఈ మధ్య కాలంలో ఆ బంధాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా కొంతమంది తేలికగా తీసేస్తున్నారు. ప్రేమ, గౌరవం, నమ్మకం తో పాటు.. ఇద్దరి మధ్య సద్దుకునే తత్వం కూడా ఉండాలి.. కానీ వాటి లోపంతోనే ఇప్పుడు ఎక్కువ మంది వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం.. ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రత సమస్యలు, పిల్లల భాద్యతలు ఇలా అన్నీ దంపతుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. భర్తకు భార్య, భార్యకు భర్త ఓ స్నేహితులా, ధైర్యం చెప్పే వ్యక్తిలా లేకపోతే, అనుమానాలు మొదలవుతాయి. కొందరు ఈ ఒత్తిడిని తాత్కాలిక ఆనందంతో తప్పించుకోవాలని కొత్త సంబంధాలకు అవకాశం ఇస్తున్నారు. ఇవే వారి జీవితాన్ని మార్చేస్తున్నాయి.
వివాహేతర బంధాలకు శారీరక, మానసిక అసంతృప్తి కూడా పెద్ద పాత్ర వహిస్తోంది. ఎమోషనల్ కనెక్ట్ ఉండకపోవడం, ప్రతి చిన్న సమస్య మాట్లాడుకోలేకపోవడం కారణంగా కొందరు ఇతరులకు దగ్గర అవుతున్నారు. ఇక సోషల్ మీడియా కూడా వివాహేతర బంధాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఫోన్ లో ఒక చిన్న చాట్ మొదలై, నెమ్మదిగా గాడి తప్పిస్తున్న పరిస్థితి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. పాత జీవితం బోరింగ్ గా అనిపించి కొత్త అనుభవాల కోసం వెతకేవారికి ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఒక మార్గం అవుతున్నాయి.
వీటితో పాటు అనుమానాలు, ప్రతీకారం కూడా వివాహేతర బంధాలకు కారణం అవుతున్నాయి. ఒక్కసారి అనుమానం పెరిగితే విడిపోకపోవడమే సమస్య అవుతోంది. చివరికి కొందరు హత్యల వరకూ వెళ్తున్న ఉదంతాలు చూస్తున్నాం. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా పెళ్లి అయిన జంటల నుండి, మూడు దశాబ్దాలు గడిచిన జంటల వరకు ఎక్కడైనా ఈ సమస్యలు చాపకింద నీరులా వెళ్తున్నాయి.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, దంపతులు రోజు కనీసం ఒక గంట సమయం కలిసి గడపాలి. సమస్యలు మాట్లాడుకోవాలి. విడిపోవడం కన్నా, విభేదాలను మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే బంధాన్ని బలపరుస్తుంది. ఒకప్పుడు భర్త అంటే భార్యకు గౌరవం తో పాటు భయం కూడా ఉండేది. ఇప్పుడు తరం మారింది, కానీ ఆ బంధం విలువ మాత్రం మారకూడదు.