క‌రోనా క‌రోనా..తెలుగు రాష్ర్టాల్లో చూడ‌రా దీని ఘ‌రానా!

దేశంలో క‌రోనా ఉగ్ర రూపం దాల్చి కేసులు..మృతుల సంఖ్య పెంచ‌డం ఒక ఎత్తైతే! అదే క‌రోనా హైరానాతో ఘ‌రానా చూపిస్తోంది.ఇప్ప‌టికే క‌రోనాపై ర‌క‌ర‌కాల కామెడీలు..పేర‌డీలు చూసాం. ఖ‌రీదైన డైమండ్ మాస్క్ అన్నారు..బంగారం మాస్క్ అన్నారు..వెండి మాస్క్ అన్నారు…ఇలా క‌రోనాని అడ్డుపెట్టుకుని కూడా ధ‌న‌వంతులు త‌మ హుందాని చాటుకునే ప్ర‌య‌త్నం చేసారు. ఇదంతా ఎవ‌రి స‌ర‌దా వాళ్ల‌ది! ఎవ‌రిష్టం వాళ్లది! ఇండియాలో ఎలాగైనా బ్ర‌తికే స్వేచ్ఛ ఉంది కాబ‌ట్టి..అందుకు అడ్డు చెప్పే రైట్ ఎవ్వ‌రికీ లేదు. అయితే అంత‌కు మించిన స‌రదా క‌రోనా ఓ ప‌క్క తీర్చేస్తుంది. దాన్నే ఘ‌రానాగా చెప్పుకుంటే చాలా సంగ‌తులే ఉన్నాయి. అందులోనూ తెలుగు రాష్ర్టాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్..తెలంగాణలో క‌రోనా సంగ‌తులు చిత్ర విచిత్రంగా ఉన్నాయండి మ‌రి. అందుకోసం క‌రోనాని ఘ‌రానాగా వ‌ర్ణించ‌డంలో త‌ప్పేం లేదు. ఆ ఘ‌రానా సంగ‌తుల్లోకి వెళ్తే…

ప్ర‌స్తుతం తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఏ ప్ర‌యివేట్ ఆసుప‌త్రికి చిన్న న‌ల‌తి చెంది వెళ్లినా డాక్ట‌ర్లు ఏం చేస్తున్నారా తెలుసా? ముందుగా కొవిడ్ టెస్ట్ అంటున్నారు. పాత జ‌బ్బుల‌తో ఆసుప‌త్రికి వెళ్లినా ఎక్క‌డ క‌రోనా రిపోర్ట్ అంటున్నారు. ర్యాపిడ్ టెస్ట్ చేసారా! ఆర్ టీ పీసీఆర్ తీసారా? లేక సిటీ స్కానింగ్ తీసారా? అందులో పాజిటివ్ వ‌చ్చిందా? నెగిటివ్ వ‌చ్చిందా! క‌మాన్ టెల్మీ్ అంటూ ఎంట్రీ గేట్ ద‌గ్గ‌రే అడిగేస్తున్నారు. మ‌నిషి గుండ్ర‌యిలా ఉన్నా డాక్ట‌ర్లు క‌రోనా ప‌రీక్ష‌ల రిపోర్ట్ అడ‌గ‌డం చూస్తుంటే! ఇది ఎంత హాస్యాస్ప‌దంగా ఉంద‌న్న‌ది న‌వ్వుకునే వాళ్ల‌కే వ‌దిలేయాలి. క‌రోనా పై వ‌దంతులు ఆ ర‌కంగా ఉన్నాయి మ‌రి.

కానీ ప్రాణం పోసే డాక్ట‌ర్లే ఇంత దుర్మార్గంగా వ్య‌వ‌రించ‌డ‌మే హేయ‌మైన చ‌ర్య‌. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాలు లేకుండా ప్ర‌యివేటు ఆసుప‌త్రికి వెళ్తే కొన్ని చోట్ల ఎదుర‌య్యే ప‌రిస్థితి ఇది. ఇక సామాన్య మాన‌వుడు బెంబేలెత్తిపోవ‌డంలో ఎంత మాత్రం త‌ప్పులేదు క‌దా. ఓ ప‌క్క ఆ క్ష‌వ‌రం కూడా జ‌రుగుతోంది. ఇప్పుడా భ‌యాందోళ‌న మ‌రింత ఎక్కువైంది. అందుకు ప‌రోక్షంగా ప్ర‌భుత్వాలు కూడా కార‌ణ‌మ‌వుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో ఇప్పుడు రోగ ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉంటే త‌ప్ప క‌నీసం ర్యాపిడ్ ప‌రీక్ష‌లు కూడా చేయ‌డంలేదు. కేవ‌లం ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డం కోస‌మే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల గ‌డ‌ప తొక్కితే ఎదుర‌య్యే ప‌రిస్థితి ఇది. క‌రోనా ఉందేమోన‌న్న చిన్న భ‌యంతో పీహెచ్ సీల‌కు వెళ్తే ఇప్పుడు ఆధార్ కార్డు..దాని వెనుక ఒక ఫోన్ నంబ‌ర్ రాసి వెళ్లండి.

కాల్ చేస్తామ‌ని తిప్పి పంపిచేస్తున్నారు. చ‌స్తే ప్ర‌భుత్వానికి సంబంధం ఏంటి? అన్న‌ట్లే వ్య‌వ‌రిస్తున్నారు. క‌రోనా వ‌చ్చిన కొత్త‌లో కొవిడ్ సిబ్బందితో నేరుగా అంబులెన్స్ ఇంటికొచ్చి..ఆ వ్య‌క్తిని ఆసుప‌త్రికి తీసుకెళ్లి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అవ‌స‌రం మేర వైద్యం అందించేవారు. ఆ ఇంటి ప‌రిస‌రాల్లో కి ఎవ‌రూ వెళ్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఏపీ-తెలంగాణ‌లో ఎక్క‌డా ఆ ప‌రిస్థితి లేదు. పైకి క‌బుర్లు మాత్రం ప్ర‌భుత్వాలు ఎలా చెబుతున్నాయంటే? క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డంలో మాకు మేమే పోటీ అంటూ కేసీఆర్-జ‌గ‌న్ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు. ఇదీ ప్ర‌భుత్వాల తీరు. ఇక ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే ఓన‌ర్లు ఏమంటున్నారో తెలుసా? క‌రోనా రిపోర్ట్ చూపించిన త‌ర్వాత అందులో నెగిటివ్ ఉంద‌ని తెలిస్తేనే ఇళ్లు ఇస్తున్నారు. లేదంటే ఆ వ్య‌క్తిని దూరం దూరం అంటూ ఓ కుష్టిరోగిలా వాళ్లంతా మాన‌సిక రోగుల్లాగా వ్య‌వ‌రిస్తున్నారు. ఇలా క‌రోనా ఎవ‌రి స‌ర‌దా వాళ్ల‌కి తీర్చేస్తూ దాని ఘ‌రానా చూపిస్తోంది మ‌రి.

-శ్రీకాంత్ కొంతం