China: ప్రపంచ దేశాలన్నీ కరోనాతో అతలాకుతలమైపోయాయి. ఇప్పటికీ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నలుగురిలో ప్రశాంతంగా కలవలేని పరిస్థితే ప్రపంచం అంతటా దాదాపు నెలకొంది. వ్యాక్సినేషన్ లో తలమునకలై ఉన్నారు. ఇక భారత్ లో సెకండ్ వేవ్ సృష్టించిన అల్లకల్లోలం గురించి తెలిసిందే. మాస్కు లేకుండా బయటకు వెళ్లలేం.. ఎవరిలో వైరస్ ఉందో అనుకుంటూ భయంగా గడిపే పరిస్థితే నెలకొంది. ఇంతటి టెన్షన్ వాతావరణంలో ప్రపంచం ఉంటే.. చైనా ఇందుకు భిన్నంగా కనిపించి ఆశ్చర్యం రేకెత్తించింది.
కరోనా వైరస్ పుట్టుకకు కారణమని ప్రపంచమంతా భావిస్తున్న.. వైరాలజీ ల్యాబ్ కూడా ఉన్న నగరం ‘వూహాన్’. ఈ నగరంలో జరిగిన ఓ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఏకంగా 11వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. పైగా.. ఎవరికీ మాస్కులు లేవు. భౌతిక దూరం లేదు. అసలు కరోనా అంటే మాకు తెలీదు అన్నట్టే సందడి సందడిగా గడిపేశారు. గతేడాది, ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్ధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ విషయం తెలిసిన ప్రపంచం ఆశ్యర్యపోతోంది. ప్రపంచం ఒకలా ఉంటే చైనాలో మాత్రం కరోనా తీవ్రత తగ్గిపోయి గతంలోలా చక్కగా తిరిగేస్తున్నారనే ఆలోచనే ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. మనకి ఇలాంటి రోజులు ఎప్పుడొస్తాయా అని అనుకుంటున్నారు. కరోనా అక్కడ పూర్తిగా అదుపులోకి వచ్చేసిందనే సంకేతాలు ఈ స్నాతకోత్సవం ఇచ్చినట్టైంది. 2019 డిసెంబరులో ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైంది ఈ నగరంలోనే. అప్పుడు మొదలైన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోల పరిస్థితుల్లోకి నెట్టేసింది.
చైనాలో ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య రెండు, మూడు వందలలోపే ఉండటం విశేషం. అక్కడ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లాక్ డౌన్, కఠిన ఆంక్షలు విధించారు. విద్యవిధానం కూడా ఆన్ లైన్లోనే జరిగింది. దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ప్రజలకు వ్యాక్సినేషన్ అందించారు. దీంతో చైనా గతంలోలా సాధారణ స్థితికి వచ్చేసింది. డడ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం జూన్ 5వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1,16,853 కాగా.. మరణాలు 5,324 సంభవించాయి.