నిజమే…నిజామాబాద్ లో కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూపులకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ గ్రూపు విభేధాలు లేకున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో ఆసక్తి మాత్రం పూర్తిగా అడుగంటిపోయింది. ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో ఎవరికి దారి వారిదే. దీంతో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభంజనంలో పత్తా లేకుండా పోయింది.  టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రారంభమైన ఈపథనం తాజాగా  స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పతాక స్థాయికి చేరింది. ఎమ్మెల్సీగా కవిత బ్రాహ్మండమైన మెజార్టీతో గెలవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది.

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది ప్రజాప్రతినిధులు ఉంటే…కిందటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కేవలం 29 మంది మాత్రమే. మిగతా వారంతా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఎంచక్కా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కారెక్కేశారు. ఎప్పుడో ఒకసారి ప్రెస్‌మీట్లు పెట్టడం.. ఏదో విమర్శించాలి కాబట్టి అధికార పార్టీని విమర్శించడం ఆతర్వాత పత్తా లేకుండా పోవడం జిల్లా కాంగ్రెస్ నాయకులకు పరిపాటి అయిపోయింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ…. ఆతర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో కూడా పేలవమైన పోటీని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మధు యాష్కికి కేవలం 70వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆతర్వాత జరిగిన జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే సీన్స్‌ రిపీట్‌ అయింది. అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇలా ఒక్కరేంటి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలంతా చేతులెత్తేయడంతో కింది స్థాయి కార్యకర్తలు అంతా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే అనిల్ ఎన్నికల సమయంలో మాత్రమే కనపడుతూ హడావిడి చేస్తున్నారనే కాని మామూలు సమయాల్లో ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఎప్పుడో గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో వీడారు. ఇలా పెద్ద నేతలంతా కాంగ్రెస్ పార్టీని వీడడంతో పార్టీ ఇంచుమించుగా ఖాళీ అయిపోయింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉనికికే ప్రమాదం తప్పదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.