పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ 50 కోట్లు ఖర్చు చేశారా.?

Revanth Reddy Buys PCC Post For 50 Cr

Revanth Reddy Buys PCC Post For 50 Cr

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ రేవంత్ రెడ్డి ఏకంగా 50 కోట్లు ఖర్చు చేశారట. కాంగ్రెస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణ ఇది. ఈటెల రాజేందర్ ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డారో, ఆ వెంటనే కౌశిక్ రెడ్డితో టచ్‌లోకి వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర సమితి. కాంగ్రెస్ పార్టీలో బలంగా వాయిస్ వినిపించే నాయకుల్లో కౌశిక్ రెడ్డి కూడా ఒకరు. అయితే, ఆయన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తమవైపుకు తిప్పుకోవడాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయ్యింది.

కౌశిక్ రెడ్డిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తానే పోటీ చేస్తానంటూ కౌశిక్ రెడ్డి, ఓ టీఆర్ఎస్ కార్యకర్తతో మాట్లాడుతున్న ఆడియో టేపు లీక్ అయ్యింది. ఆ ఆడియో లీక్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ.

షోకాజ్ నోటీస్ మాత్రమే కాదు, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం కూడా తప్పదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఇంతలోనే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోపక్క, కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇదిలా వుంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని కౌశిక్ రెడ్డి అంటున్నారు.

కౌశిక్ రెడ్డి గతంలో ఈటెల రాజేందర్ చేతిలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. అప్పుడు ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి నేత. ప్రస్తుతం ఈటెల, బీజేపీ నేతగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. మొత్తమ్మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం కోసం 50 కోట్లు ఖర్చు చేశారన్న ఆరోపణ మాత్రం బలంగా వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడంటూ రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆరోపించిన విషయం విదితమే.