రేవంత్ మార్కు రాజకీయాలతో ఉలిక్కిపడుతున్న టీఆర్ఎస్

Revanth Mark Politics Worrying TRS

Revanth Mark Politics Worrying TRS

బీజేపీ నుంచి నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి లాగేస్తున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశమొచ్చాక, బాధ్యతలు స్వీకరించే లోపే.. పార్టీలో వున్న అంతర్గత వ్యతిరేకతను చల్లార్చేందుకు ప్రయత్నించారు.. అందులో చాలావరకు సఫలమయ్యారు కూడా. పీసీసీ అధ్యక్షుడైన వెంటనే, బలప్రదర్శన.. అన్న కోణంలో, ఇతర పార్టీలకు చెందిన నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి లాగుతున్నారు. తద్వారా అధిష్టానం వద్ద రేవంత్ ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశారు.

ప్రధానంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ముందు ముందు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలూ కాంగ్రెస్ పార్టీలో చేరతారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. చిన్న పదవికే రేవంత్ రెచ్చిపోతున్నారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున్నవిమర్శల్లో ‘గులాబీ మార్కు కంగారు’ కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కానీ, కేటీఆర్.. ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్.. అలా చూసుకుంటే, కేటీయార్ పదవే చిన్నదంటూ రేవంత్ మద్దతుదారులు నినదిస్తున్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ శ్రేణులతోపాటు, టీడీపీ శ్రేణులూ అండగా వుంటున్నాయి. అదే అతనికి అడ్వాంటేజ్. అయితే, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు పైకి కనిపించేదానికి భిన్నంగా వుంటాయి. సో, రేవంత్ బలాన్ని అప్పుడు అంచనా వేసెయ్యడం తొందరపాటే అవుతుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోలేకపోతే, రేవంత్ గ్రాఫ్ అనూహ్యంగా నేలమట్టమైపోతుంది. అందుకే, రేవంత్.. తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. ఎలాగైనా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే పట్టుదలతో వున్నారాయన. తన పనితీరుకి ఈ ఉప ఎన్నిక ఓ కొలమానం అనే భావనతో వున్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ దూకుడు నేపథ్యంలో అధికార పార్టీ ఒకింత కలవరపాటుకు గురవడం సహజమే. పైగా, తమ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ వైపు వెళతారోనన్న ఆందోళన గులాబీ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.