దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు షాకివ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అసలే కేసీఆర్ వ్యూహాలతో నలిగిపోతూ ఎలా పైకి లేవాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు కిందా మీదా పడుతున్నారు. పైగా పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీని మరింత కిందకు లాగేస్తోంది. దీంతో పుంజుకునేందుకు బలమైన అవకాశం ఏదైనా దొరుకుతుందేమోనని కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో దుబ్బాక ఉపఎన్నిక వారికో వరంలా కనిపించింది. దుబ్బాకలో పాగా వేయగలిగితే అధికార పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు, పార్టీకి ముందుకు కదలడానికి మంచి బూస్ట్ అందించినట్టు ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
2009లో ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కానీ 2014, 2018 ఎన్నికల్లో తెరాస నెగ్గింది. గత ఆరేళ్లలో టిఆర్ఎస్ పార్టీ అక్కడ బాగా బలపడింది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మరణంతో సానుభూతి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నడుమ తెరాసను ఓడించడమంటే పెద్ద పనే. అందుకే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించిన కాంగ్రెస్ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉంది. ఆమె అయితేనే అన్ని విధాలా అధికారపార్టీని ఢీకొట్టగలరని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పైపెచ్చు విజయశాంతికి కేసీఆర్, తెరాసలతో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయి వాతావరణం చాలా ఏళ్ల నుండి ఉంది. అది బాగా పనిచేస్తుందనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్.
కానీ విజయశాంతి మాత్రం ఉపఎన్నికలో దిగడానికి అంత సుముఖంగా లేరట. హైకమాండ్ ఆమెను ఒప్పించడానికి నానా తంటాలు పడుతోంది. అయినా ఆమె మనసు మారట్లేదట. సరైన కారణం తెలియదు కానీ ఆమె విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్నారట. సినిమా ఆఫర్లు పెరుగుతుండటంతో ఆమె పూర్తిగా ఇండస్ట్రీకే పరిమితమవ్వాలనే యోచనలో ఉన్నారని కూడ అంటున్నారు. ఇన్ని అనుమానాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న తరుణంలో విజయశాంతి ఒక పూజా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఈ పూజా పెద్ద యాగంలా ఉంటుందట. ఈ యాగం ముగిశాకే ఆమె ఎన్నికల్లో పోటీపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చెప్పుకుంటున్నారు. యాగంతో ఆమె మనసు మారి ఉప ఎన్నికలో నిలబడితే తాము గెలవడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.