విజయనగరం వైసీపీలో లుకలుకలు మాటేంటి..?

cm jagan telugu rajyam

 ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీలో మెల్ల మెల్లగా అసమ్మతి సెగలు పైకి లేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా తమకి ఎలాంటి పదవులు రాలేదనే బాధతో కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. దానికి తోడు అధికార పార్టీలోకి పక్క పార్టీ నుండి వలసలు రావటంతో పాత వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి మధ్య పొసగటం లేదు. ఇక విజయనగరం జిల్లాలో కూడా వైసీపీలో విభేదాలు బయట పడుతున్నాయి.

rajanna dora telugu rajyam

 

  ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో అవి తారా స్థాయికి చేరుకున్నాయి. స్థానిక వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే రాజన్న దొర పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా, స్థానిక కార్యకర్తలు పనులు కోసం వస్తే కనీసం వాళ్ళని కలవటానికి కూడా ఇష్టపడటం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కూడా రాజన్న దొర ఎమ్మెల్యే గా పనిచేసి వైఎస్ తో మంచి సన్నిహిత సంబంధాలు నడిపాడు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి తో కలిసి వైసీపీ పార్టీలో కొనసాగుతున్నాడు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీనియారిటీ మరియు గిరిజన కోటాలో రాజన్న దొరకు మంత్రి పదవి ఖాయమని అందరు అనుకున్నారు, కానీ ఆయన కంటే జూనియర్ అయినా పుష్ప శ్రీవాణికి మంత్రి పదవి ఇవ్వటమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టడంతో రాజన్న దొరలో అసంతృప్తి పెరిగిపోయింది.

   ఇప్పుడే కదా అధికారం లోకి వచ్చింది, మున్ముందు ఎదో ఒక పదవి రాకుండా పోతుందా అనే ఆశతో వున్నాడు రాజన్న దొర, కానీ ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ఆయనకి ఎలాంటి పదవి రాకపోవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనితో రాజన్న దొర పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఒకప్పుడు సాలూరు లో పార్టీ పరంగా అందరికి చేదోడువాదోడుగా వుండే రాజన్న దొర నేడు దూరముగా ఉండటంతో స్థానిక నేతల్లో అయోమయం నెలకొని వుంది. గతంలో రాజశేఖర్ రెడ్డితో, నేడు జగన్ మోహన్ రెడ్డి తో కూడా సన్నిహితంగా వుండే రాజన్న దొరకి ప్రభుత్వంలో సరైన గౌరవం ఎందుకు దక్కలేదు అనేది ఎవరికీ అంతు చిక్కకి ప్రశ్న..మరి దానికి సమాధానం లభించి, గతంలో మాదిరి రాజన్న దొర పాలిటిక్స్ లో యాక్టీవ్ అవుతాడో లేడో చూడాలి.