తూర్పు గోదావరి ఏపీ రాజకీయాల్లో కీలకమైన జిల్లా, ఆంధ్ర రాజకీయాలు ఎక్కువగా ఆ జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. అలాంటి జిల్లాలో ఇప్పుడు వర్గ పోరు గట్టిగానే కనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు నియోజవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు వైరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. వరుపుల రాజా మరియు పర్వత పూర్ణచంద్ర రావు మధ్య పచ్చగట్టి వేస్తె భగ్గుమనే పరిస్థితి వచ్చింది. దాదాపు నాలుగు తరాల నుండి వరుపుల కుటుంబం, రెండు తరాల నుండి పర్వత కుటుంబం ఇక్కడ రాజకీయాలలో హవా చూపిస్తున్నాయి.
పైగా ఇరు కుటుంబాలకు బంధుత్వం ఉండటంతో పెద్దగా గొడవలు లేకుండా ఒకరు టీడీపీలో మరొకరు కాంగ్రెస్ వుంటూ రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పర్వత పూర్ణచంద్ర రావు వైసీపీ తరుపున పోటీచేసి గెలిచాడు, వరుపుల రాజా టీడీపీ నుండి పోటీచేసి ఓడిపోయాడు. అయితే నియోజకవర్గంలో తన పట్టు కోల్పోకూడదని భావించిన రాజా.. వైసీపీ లోకి రావటానికి సిద్ధమైయ్యాడు. దీనితో పూర్ణచంద్ర రావు అతని రాకను గట్టిగా వ్యతిరేకిస్తూ అడ్డుకున్నాడు. అంతే కాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు రాజా డీసీసీబీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
ఆ సమయంలో అందులో అనేక అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని పూర్ణచంద్ర రావు ఏకంగా సీఎం జగన్ తో మాట్లాడాడు, దీనితో ఈ ఏడాది మొదటిలో రాజాపై విచారణ అక్రమాల విషయంలో విచారణ మొదలైంది. 20 కోట్లు అక్రమాలు జరిగాయని తేల్చి వరుపుల, రాజాను అరెస్ట్ చేయటానికి రంగం సిద్ధం చేశారు. దీనితో రాజా హైకోర్టు కు వెళ్లి తన అరెస్ట్ పై స్టే తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లిపోయాయి . అయితే ఇద్దరు కాపు నేతలు కావటంతో జిల్లాలోని కాపు పెద్దలు వీళ్లిద్దరి మధ్య రాజీ చేయటానికి ప్రయత్నాలు చేశారు, కానీ అవేమి పెద్దగా ఫలించలేదు. ప్రస్తుతం ఆ ఇద్దరి నేతలు ఆధిపత్యం కోసం పోరాడుతూనే వున్నారు. మరి ఇందులో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.