ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. వైరస్ పేరెత్తితేనే ఒణికిపోతున్నాం. మహమ్మారిని నుంచి బయట పడి ఎలా బట్టకట్టేదిరా? బాబు అని అంతా బుర్రలు పీక్కుంటున్నారు. ఇక తెలుగు రాష్ర్టాల్లో అయితే బ్రహ్మంగారి వాక్కు ఎక్కడ ఫలిస్తుందేమోనన్న భయం మరో వైపు. అందుకు చోటు చేసుకుంటోన్న పరిస్థితులే ప్రధాన కారణం. అసలు ఊహించామా? కనీసం ఏనాడైనా ఆలోచనకైనా వచ్చిందా? కరోనా అనే మహమ్మారి మానవాళిని కబళించేస్తుందని! ఇలాంటి విపత్తుతో అల్లకల్లోలమైపోతామని! ఇలా రకరకాల ఆందోళనతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి.
అయితే సోషల్ మీడియాలో అందులోనూ ఇండియాలోనూ కరోనా పై కామెడీలు అంతే జోరుగా వైరల్ అవుతున్నాయి. వైరస్ రాకుండా మూతికి మాస్కులు కట్టుకుంటుంటే? ఆ మాస్కులపై వచ్చే కామెడీ వీడియోలు ఎన్నెన్నో. మాస్కుల పేరుతోనూ సమాజంలో తమ ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని చాటుకునే ప్రయత్నం చేసిన వారు కొందరు. డైమండ్ల తో సిద్దం చేసిన మాస్కులు..వెండి మాస్కులు..బంగారం తో తయారు చేసిన మాస్కులు… ఇలా రకరకాల మాస్కులతో సమాజంలో తమ గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి.
ఇక కరోనాపై సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెడీ వీడియోలు..పేరడీ వీడియోల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. వైరస్ పై కామెడీ..లాక్ డౌన్ పరిస్థితిపై హాస్యాస్పదమైన వీడియోలు..కష్టంలో కామెడీ..సుఖంలో కామెడీ..ఇక సంచలనాల రాంగోపాల్ వర్మ కరోనాని ఏ రేంజ్ లో ఎన్ క్యాష్ చేసుకున్నాడో చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ సమయంలో కరోనాపై ట్రైలర్లు..సినిమాలు చేసి రిలీజ్ చేసేసాడు. ఇలా కరోనాని కూడా కొంత కామెడీగా మార్చేసారు. నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. అలాగని అన్నీ చోట్లా కాదు కదా? అందుకేనేమో కరోపై మనోళ్లు అంత కామెడీ చేసినట్లున్నారు. ఇలా కరోనాపై ప్రపంచ దేశాలేవి చేయని కామెడీ ప్రయత్నాలన్ని ఇండియాలో జరిగాయి అనడానికి పై కారణాలే పెద్ద ఉదహారణలు. మరి ఈ కామెడీలు..పేరడీలు ఇంకెంత కాలమో.