మొన్నటి వరకు ఇద్దరూ దోస్తులే కానీ.. నదీ జలాల విషయంలో ఇద్దరూ బద్ధశత్రువులు అయిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఢీ అంటే ఢీ అని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇద్దరిలో ఎవరూ తక్కువకాదు.
ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నదీ జలాల సమస్యపై త్వరలో జరగనున్న అపెక్స్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు.
ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలనే తెలంగాణ ప్రభుత్వంతో కయ్యం పెట్టుకుంటోందని దుయ్యబట్టారు. ఏపీ వాదనలకు అపెక్స్ కౌన్సిల్ లో సరైన సమాధానం చెప్పాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇంకోసారి తెలంగాణ జోలికి ఏపీ ప్రభుత్వం రాకుండా.. వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలని కేసీఆర్ అన్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలపై అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి.. సీఎం కేసీఆర్ అక్టోబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.