CM KCR Announces Govt Jobs : వచ్చే ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత వ్యూహాత్మకంగా దాదాపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
91 వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయనీ, వాటిల్లో 80 వేల ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సీఎం కేసీయార్, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మిగిలిన 11 వేల పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తారట. 95 శాం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామనీ కేసీయార్ చెప్పుకొచ్చారు.
నిజంగానే నిరుద్యోగులకు తీపి కబురు ఇది. తెలంగాణలో ఉద్యోగాల కోసం చాలా ఏళ్ళుగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది.. ఈ క్రమంలో కొన్ని బలవన్మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాల విషయంలోనూ, అభివృద్ధిలోనూ తెలంగాణ దూసుకుపోతున్నా.. నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణలో ఒకింత ఆందోళనకరమే.
ఈ నేపథ్యంలోనే కొలువుల జాతర షురూ అయ్యింది. అయితే, ఇదంతా వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్య అనుకోవాలా.? దీన్ని ఓటు బ్యాంకు రాజకీయం అని ఎందుకు అనుకోకూడదు.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు.. కేసీయార్ కూడా రాజకీయ నాయకుడే.. ఆయన రాజకీయం చేస్తే తప్పేంటట.? అయితే, ఇది కూడా ముందస్తు ఎన్నికల వ్యూహమేనా.? అన్నదే అసలు చర్చ. ముందస్తుగా అంటే ఎప్పుడు.? ఇంకో ఆర్నెళ్ళ కంటే ఎక్కువ సమయం ముందుకు అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేసీయార్ ప్లాన్ చేస్తున్నారేమో.
ఏమో, కేసీయార్ చేసినా చేస్తారు.! కేసీయార్ వ్యూహాలు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం కదా.!