ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నేతలు కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన నేడు ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. ఈ నెల 4న అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అనుకోకుండా కొన్నికారణాలవల్ల ఆ సమావేశం వాయిదా పడింది.
ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాను కలిసి విన్నవించుకోవాలని సీఎం జగన్ భావించారు. కానీ అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఏపీ సీఎంవో కోరినట్లు తెలుస్తోంది. గత జనవరిలో హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. అప్పటి హస్తిన పర్యటనలో ఇరువురి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
ముఖ్యంగా ఆలయాలపై దాడులు, జమిలీ ఎన్నికలు తదితర అంశాలను చర్చించినట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. సడెన్ గా ఇప్పుడు సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళుతుండడం వెనక… కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఎజెండాతోనే వెళుతున్నారా లేక రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏపీ విభజన హామీలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్నింటిపైనా స్పష్టంమైన హామీ తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.. వీటితోపాటు ప్రత్యేక రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.