ఏపీ సీఎం వైఎస్ జగన్… దూకుడు మీదున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి రైతులను, పేదలను ఆదుకున్నారు సీఎం జగన్. తాజాగా… పేద విద్యార్థులకు కూడా భరోసా ఇచ్చారు. విద్యార్థుల కోసం విద్యా కానుకను ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేయనున్నారు. నిజానికి నవంబర్ 2న ఏపీలో పాఠశాలలు ప్రారంభం కానున్నా… అక్టోబర్ 5నే విద్యా కిట్లను విద్యార్థులకు అందజేస్తారు. దీని వల్ల స్కూళ్లు తెరిచేలోపు విద్యార్థులు యూనిఫాం కుట్టించుకుంటారని ముందుగానే విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా.. సీఎం జగన్ ఈ విషయాలను వెల్లడించారు. అలాగే.. నాడు-నేడులో భాగంగా.. స్కూళ్లలో ఇంకా మొదటి దశ పనులు ప్రారంభం కాకపోతే వెంటనే మొదలు పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన పాఠశాలల్లో టాయిలెట్ల శ్లాబ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి.. పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని.. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు రాకూడదని.. కోవిడ్ 19కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా పాఠశాలల్లో తీసుకోవాలని సీఎం సూచించారు.