సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు… చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సీమ రాజకీయాల్లో సీకే బాబుకు చిత్తూరు టైగర్ అనే బ్రాండ్ నేమ్ ఉంది. టైగర్ అనే బిరుదుకు తగ్గట్టే ఆయన చరిత్ర కూడ హెవీగానే ఉంటుంది. కార్మిక నేతగా మొదలై నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు సీకే బాబు. 1989లో స్వతంత్ర్య అభర్థిగా రంగంలోకి దిగి అనూహ్య విజయం సాధించిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 89 విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1994, 1999 ఎన్నికల్లో కూడ విజయం సాధించారు. ఈ మూడు దఫాల్లో సీకే బాబు కాంగ్రెస్ పార్టీలో, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానమైన వ్యక్తి అయ్యారు.
ఒక దఫాలో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచినా చిత్తూరు స్థానం నుండి మాత్రం సీకే బాబు ఎమ్మెల్యే అయ్యారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన 2004లో అయనకు కాంగ్రెస్ టికెట్టివ్వలేదు. అయినా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓటమిపాలయ్యారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండగా ఉండటంతో 2009 ఎన్నికల్లో టికెట్ సాధించిన ఆయన విజయం సాధించారు. కానీ వైఎస్ మరణంతో సీకే బాబు రాజకీయ జీవితం ముక్కలైంది. కాంగ్రెస్ పార్టీతో పొసగక 2014లో వైసీపీలో చేరారు. కానీ జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో నొచ్చుకున్న ఆయన 2017లో బీజేపీలో 2019 ఎన్నికల్లో టికెట్ దొరక్కపోవడంతో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.
అక్కడ కూడ టికెట్, తగిన ప్రాధాన్యం లభించలేదు. పైగా చిత్తూరులో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన్ను అధిష్టానం సైతం పక్కనపెట్టింది. అలా టైమ్ బ్యాడ్ అయి రాజకీయాల్లో అట్టడుగుకు జారిపోయిన సీకే బాబు ప్రజెంట్ వైసీపీ వైపు అడుగులువేస్తున్నారు. ఎలాగైనా మళ్లీ పుంజుకుని చిత్తూరులో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. అందుకే మళ్లీ జగన్ పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారట. కానీ జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ అందాల్సి ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన్ను నిర్లక్ష్యం చేసిన జగన్ ముఖ్యమంత్రి హోదాలో సీకే బాబును కనీసం కన్నెత్తి అయినా చూస్తారా అనేదే అనుమానంగా మారింది. అయితే ఈసారి సీకే బాబు తాను కాకుండా తన భార్య, కుమారుడిని రాజకీయాల్లోకి దింపాలని భావిస్తున్నారు.