జగన్ సర్కారుపై చిరు ప్రశంస.. జనసైనికులకు షాక్

Chiru Praises YS Jagan, Janasainiks In Shock

Chiru Praises YS Jagan, Janasainiks In Shock

ఒకే రోజు రికార్డు స్థాయిలో 13 లక్షలకు పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసిన ఆంధ్రపదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి, జగన్ సర్కారుపై ప్రశంసలు కురిపించగా, జనసైనికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవల ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి 13.72 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసిన విషయం విదితమే. దేశంలోనే ఇది సరికొత్త రికార్డ్. కాగా, నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 17 లక్షల వ్యాక్సిన్లను ఒకే రోజు పంపిణీ చేసిందనుకోండి.. అది వేరే సంగతి. అన్నట్టు, మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రపదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం, వైఎస్ జగన్ సర్కారుకి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు.

మూడు రాజధానుల విషయంలోనూ జగన్ సర్కారుకి అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లోనూ చిరంజీవిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. జనసేన నినాదం ఏకైక రాజధాని కాగా.. ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి ఇలా మూడు రాజధానులకు మద్దతు పలకడమేంటన్న విమర్శలు వినిపించాయి. ఓ అన్నగా పవన్ కళ్యాణ్ వెంట తాను వుంటానంటూనే, సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థుల మీద చిరంజీవి ప్రశంసలు కురిపిస్తుండడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా, అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతోందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రాజ్యసభ కోసమే చిరంజీవి, వైఎస్ జగన్ సర్కారుని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తున్నారా.? అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల సారాంశం. చిరంజీవి మాత్రం, తాను రాజకీయాలకు దూరంగా వున్నాననీ, మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాల్ని ప్రశంసించడం పౌరుడిగా తన బాధ్యత అనీ అంటున్నారాయన.