Jinna Centre : అఖండ భారతావని రెండు ముక్కలవ్వడానికి కారకుడు మహ్మద్ ఆలీ జిన్నా. ఇది నాణానికి ఓ వైపు. అంతకు ముందు అఖండ భారతావనిలో బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారిలో జిన్నా కూడా కీలకమైన వ్యక్తే. పాకిస్థాన్ జాతిపితగా జిన్నాని అక్కడి ప్రజలు పూజిస్తారు. మనం మన గాంధీని మహాత్ముడని ఎలా అంటున్నామో.. అక్కడ పాకిస్థాన్‌లో జిన్నా అలాగన్నమాట.
ఈ చరిత్ర ఇప్పుడెందుకు.? ఎందుకంటే, ఏపీ కమలనాధులకి కొత్త వివాదం కావాలి కనుక. ఏడు దశాబ్ధాలుగా గుంటూరులో ఉన్న జిన్నా సెంటర్ పేరు మార్చాలన్నదే కమలనాధుల కొత్త డిమాండ్. చీప్ లిక్కర్ పార్టీగా విమర్శలు ఎదుర్కొంటోన్న ఏపీ బీజేపీ, ఆ మకిలి వదిలించుకోవడానికి జిన్నా రచ్చని తెరపైకి తెచ్చింది.
సరే, ఎలాగూ వివాదం తెరపైకి వచ్చింది. జిన్నా పేరుని తొలిగించడమే మంచిదేమో. కానీ, అలా చేస్తే, మైనారిటీ ఓటు బ్యాంకు తేడా కొడుతుందేమోనని కొన్ని పార్టీలు అనుకోవచ్చుగాక. రాజకీయాలంటేనే ఇంత. ఇవి నిజానికి చాలా సున్నితమైన అంశాలు. దేశభక్తి, మతం.. ఈ రెండు అంశాల చుట్టూ రాజకీయం నడపడం అత్యంత హేయం.
అధికార వైసీపీ నిజంగానే ఇప్పుడు ఇరకాటంలో పడింది. జిన్నా సెంటర్ పేరు మార్చకపోతే ఒక తంటా. మార్చితే, ఇంకో తంటా. అసలు బీజేపీకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి.? 2014 నుంచి 2018 వరకూ ఏపీలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంది బీజేపీ. అప్పుడు కలగని జ్ఞానోదయం ఇప్పుడెందుకు కలిగింది.?
చిత్రమేంటంటే, బీజేపీ వాదనని ఎవ్వరూ సమర్ధించలేకపోతున్నారు. అదే సమయంలో మరీ అంతలా వ్యతిరేకించలేకపోతున్నారు. సున్నితమైన అంశం కదా.. పెద్ద సంకటమే తెచ్చింది. పరిష్కారం అంత తేలిక కాని సమస్యని బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించింది.