ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వద్ద జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న ఒకే ఒక బలమైన అంశం అమరావతి. ఇప్పటికే నిర్మాణం మొదలుపెట్టుకుని కొంత పూర్తిచేసుకున్న అమరావతిని కాదని జగన్ మూడు రాజధానులు అంటూ కొత్త నిర్ణయం తీసుకోవడంతో జగన్ మీద జనంలో ఒకింత వ్యతిరేకత మొదలైంది. ఆనాడు అసెంబ్లీలో అమరావతికి సరేనంటూ తలూపిన జగన్ ఇప్పుడు కొత్తగా ఈ మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ ఎందుకు అంటున్నారో జనానికి అర్థం కాలేదు. అయితే దాన్ని క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారనే అనాలి. ఎందుకంటే రైతుల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలఛాఫ్డం బాబుగారికి చేతకాలేదు. రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా అమరావతిని తీసేయవద్దనే అంటారు. సరే పోరాటం చేద్దామా అంటేనే బిక్కమొహం వేస్తారు.
అంటే జనంలో అమరావతి పట్ల,అక్కడ భూములిచ్చిన రైతుల పట్ల సానుభూతి ఉంది కానీ వాళ్ళ తరపున నిలబడి పొరాడేంత ఆలోచన మాత్రం లేదు. దీనికి తోడు అధికార పక్షం కేవలం తన బినామీల కోసమే చంద్రబాబు అమరావతిని వెనకేసుకొస్తున్నారని, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అబివృద్ది చెందుతాయని అంటుండటం కూడ అమరావతి వెనుకబడిపోవడానికి కారణమే. అధికారంలో ఉండగా అమరావతిని తన కలల నగరంగా ఎలివేట్ చేశారు తప్ప దాన్ని ప్రజలకు దగ్గరచేసే ప్రయత్నం చేయలేదు బాబుగారు. అమరావతి పూర్తయితే తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని ఆశపడ్డారే తప్ప దాన్ని ప్రజల రాజధానిగా చేయాలని మాత్రం అనుకోలేదు.
అందుకే అమరావతి సెంటిమెంట్ ఆంధ్రా ప్రజల్లో తక్కువగా ఉంది. కాబట్టే ఏడాది తరబడి రైతులు దీక్షలు చేస్తున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మెల్లగా అమరావతిని రెఫరెండం అనే స్థాయికి తీసుకెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మూడు రాజధానుల నినాదంతో బరిలోకి దిగాలని, తాము అమరావతి నినాదంతో పోటీచేస్తామని చంద్రబాబు సవాల్ విసిరితే అమరావతి కావలసింది మీకు కాబట్టి మీ ఎమ్మెల్యేలనే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లండి అంటూ గట్టి సెటైర్ వేశారు వైసీపీ నేతలు. దాంతో రాజీనామా సవాళ్లకు తెరపడింది. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికలు త్వరగా వస్తే బాగుండని హెగట్టిగా అనుకున్నారు.
ఆయన కోసమే అన్నట్టు తిరుపతి లోక్ సభకు యూపీఏ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ అవకాశాన్ని చంద్రబాబు వాడుకోలేకపోయారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా అమరావతి కోసం పోరాడే నేత ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉంటే చంద్రబాబుకు కొద్దిగా వెయిట్ పెరిగేది. ఎన్నికలు జరుగుతున్నది సీమ వైపు కాబట్టి అమరావతికి మద్దతిచ్చే అభ్యర్థి గెలుపు కొద్దిగా కష్టమే అయ్యుండేది. ఒకవేళ ఓడిపోయి ఉంటే ఆ ఓటమిని ఉత్తరాంధ్రలో క్యాష్ చేసుకుని ఉండవచ్చు. అమరావతి కోసం తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్ద సాహసమే చేశామని చెప్పుకోవడానికి ఉండేది. ఆ పరిణామంతో అమరావతి మీద చంద్రబాబుది కపట ప్రేమనే అపవాదు పోయేది. అలా వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో మరింత బలపడటానికి వీలు చిక్కేది. కానీ బాబుగారు తిరుపతిలో గెలవాలనే తపనతో మళ్ళీ పనబాక లక్ష్మికే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్థానం గెలిచినా చంద్రబాబు బావుకునేది, టీడీపీ పుంజుకునేది ఏమీ లేదు.