ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీల దృష్టి మొత్తం తిరుపతి ఉప ఎన్నికల మీదే ఉంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా పార్టీలన్నీ ఇప్పటి నుంచే సంసిద్దమవుతున్నాయి. ఎవరికివారు సొంత వ్యూహాలు పన్నుకుంటున్నారు. 2019 ఎన్నికల తరవాత మొదటిసారి జరగనున్న ఎన్నికలు కావడంతో అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో పార్టీలు చాలా సీక్రెసీ మైంటైన్ చేస్తాయి. ఎలా ముందుకెళుతున్నామనేది ప్రత్యర్థి పార్టీలకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాయి. ముఖ్యంగా పార్టీ అధినేత ప్లానింగ్ ఏమిటనేది సొంత నేతలకు కూడ తెలియనివ్వరు. పోటీచేయబోయే అభ్యర్థి విషయంలో పలువురు పేర్లను వినిపించేలా చేసి అపోనెంట్ పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రత్యర్థి పార్టీలు కూడ అవతలి పార్టీ అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో ఖచ్చితమైన టార్గెట్ పెట్టుకోలేక తికమకపడతాయి.
వాళ్ళు ఆ గందరగోళంలో ఉండగానే ఎన్నికలకు కొన్నిరోజుల ముందు అభ్యర్థిని ప్రకటిస్తారు. అంతా చివరి నిముషంలోనే ప్లాన్ చేసినట్టు కలరింగ్ ఇస్తారు. అప్పుడు జనంలో కూడ పార్టీ అభ్యర్థుల పట్ల ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి అభ్యర్థి పేరు రివీల్ అయ్యేసరికి క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. దాదాపు అన్ని పార్టీలు ఇదే విధంగా చేస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకో తొందరపడిపోయారు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, బీజేపీలకు తమ టార్గెట్ ఏంటో మూడు నెలల ముందుగానే తెలిసిపోయింది. ఇంకేముంది ఈపాటికే పనబాక లక్ష్మి మీద ఎలా దండయాత్ర చేయాలో ఒక ప్రణాళికను వేసేసుకుని ఉంటారు.
ఎంతటి గట్టి లీడర్ అయినా ఎదురుదాడిని కొన్నిరోజులు మాత్రమే తట్టుకోగలరు. కానీ ఇక్కడ పనబాక లక్ష్మి మూడు నెలలు పద్మవ్యూహంలో నిలబడాల్సి వచ్చింది. అసలే గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి. పైపెచ్చు బలహీనమైన ప్రతిపక్షంలో ఉన్న నేత. పోటీచేస్తున్నది కూడ సానుభూతి అంశం గట్టిగా పనిచేసే పరిస్థితులున్న స్థానంలో. ఇంకేముంది ఇక్కడే ఆమెకు బోలెడన్ని కష్టాలు కనబడిపోతున్నాయి. సరే నియోజకవర్గంలో కలిసివచ్చే టీడీపీ లీడర్లు ఎవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. అందరూ ఓడిపోయిన నిరుత్సాహంలో పక్క చూపులు చూస్తున్నవారే. చుట్టూ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నది మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే. ముప్పేట దాడి ఖాయం. ఈ దాడిని ఎదుర్కోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇప్పటికే ఆమె మీద నాన్ లోకల్ అనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎలా ఓడిపోయింది మరోసారి గుర్తుచేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇక బీజేపీ అయితే చాప కింద నీరులా పనులు చేస్తోంది. ఏకంగా అధికార పార్టీ మనుషులనే మేనేజ్ చేశాం అంటున్నవారు ప్రతిపక్షం నేతలను మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు చేయకుండా ఉండరు. ఈ చిక్కులన్నీ పనబాకకు శక్తికి మించిన కష్టాలే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే ఈ మూడు నెలలు పనబాక ఎవరి మీద శక్తిని కూడగట్టుకోవాలి అనే విషయంలో కూడ క్లారిటీ లేదు. ఎందుకంటే వైసీపీ, బీజేపీ – జనసేన కూటములు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాబట్టి చీకట్లో బాణాలేస్తూ కూర్చోవడం తప్ప ఆమె చేయగలిగింది ఏమీ లేదు. ఇలా చంద్రబాబు ఏదో చేద్దామనుకుని మూడు నెలల ముందే ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ ఏంటో చూపించేసి గొప్ప ఘనకార్యమే చేశారు.