వైఎస్ జగన్ అమరావతి విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారో అందరం చూస్తున్నాం. నోరు మెడపకుండా ఈరోజు ఆయన రాజధానిని మార్చగలిగారు అంటే ఎంత ధీమా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు, వేలాది మంది రైతులు అడ్డు తగులుతున్నా జగన్ చాలా ఈజీగా రాజధానిని తరలించేశారు. జగన్ ఇంత అలవోకగా ఈ పని చేయడానికి గతంలో చంద్రబాబు చేసిన కొన్ని పొరపాట్లే కారణం. వాటిలో ప్రధానమైనది అమరావతి మీద తన మార్క్ మాత్రమే ఉండాలని బాబుగారు అనుకోవడం. అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి అనే మార్క్ క్రియేట్ చేయాలనుకోవడం. గత ఐదేళ్లు అమరావతి నిర్మాణం జరుగుతున్నన్ని రోజులు తన పేరు, టీడీపీ పేరే వినబడేలా జాగ్రత్తపడ్డారాయన.
చివరికి ఆంధ్రా ప్రజలు సైతం అమరావతిని పూర్తిస్థాయిలో ఓన్ చేసుకోలేకపోయారు. ఇది మన రాజధాని అనుకోలేకపోయారు. కేవలం బాబుగారు కడుతున్న కట్టడం అనుకున్నారంతే. ఇప్పటికీ ఆంధ్రుల్లో అమరావతి కంటే హైదరాబాద్ పేరు చెబితేనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంతో జనం పెంచుకున్న అనుబంధం అలాంటిది. అదే అమరావతి విషయంలో సాధ్యం కాలేదు. టీడీపీ అభిమానులు తప్ప మామూలు ప్రజలు ఎవరూ అమరావతికి అంతగా కనెక్ట్ కాలేదు. అదే జరిగిన పెద్ద పొరపాటు. జనమే గనుక అమరావతిని తమది అనుకుని ఉంటే ఈరోజు జగన్ దాన్ని కదల్చగలిగేవారు కాదు.
బాబు చేసిన మరొక తప్పు అమరావతి నిర్మాణంలో ఇతర పార్టీలను ఇన్వాల్వ్ కానివ్వకపోవడం. ఆనాడు అసెంబ్లీలో జగన్ సైతం అమరావతికి అంగీకారం తెలిపారు కానీ ఆ తర్వాత ఎప్పుడూ అమరావతి విధి విధానాల్లో కల్పించుకోలేదు. కనీసం శంఖుస్థాపనకు కూడా హాజరుకాలేదు. అందుకు జగన్ అనాసక్తి ఒక రీజన్ అయితే టీడీపీ ఆయన్ను ఇన్వాల్వ్ కానివ్వలేదు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఇది మన రాజధాని, దీనికి మీ సహకారం కూడా కావాలి అంటూ వైసీపీని కలుపుకుని వెళ్లి ఉంటే ఈనాడు జగన్ సైతం రాజధానిని కదల్చడానికి ఆలోచించేవారు. అవేవీ బాబు చేయలేదు. తన మార్క్ మాత్రమే ఉండాలని తపించారు. అదే జగన్ కు నచ్చలేదు. బాబు బ్రాండును ఆయన అంగీకరించలేక ఈరోజు రాజధానిని మార్చేశారు. ఆనాడు బాబు హయాంలో ఆ తప్పులే జరగకపోయి ఉంటే ఈనాడు పరిస్థితులు వేరుగా ఉండేవి.