AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో పలు నియోజక వర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గురించి కూటమి ప్రభుత్వం గురించి ఈయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేశారని, ఈసారి ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు నాయుడుని ఇటు వైపు తంతే అటువైపు వెళ్లి పడతారు అంటూ జగన్ విమర్శలు కురిపించారు.
చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కవని తెలిపారు. టిడిపి అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని వైయస్ జగన్ సరికొత్త నిర్వచనం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. ఈరోజు అక్రమ కేసులతో ఎంతోమంది వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారందరి పేర్లు మీ ఇష్టం వచ్చిన బుక్కులో రాసుకోండి.
2029 ఎన్నికలలో తప్పకుండా అధికారంలోకి వచ్చేది మనమేనని, ఆరోజున మిమ్మల్ని ఎవరైతే వేధించారో వారందరూ ఎక్కడ ఉన్నా లాక్కొస్తామని వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాము అంటూ జగన్ తెలిపారు.జగన్ 2.Oలో సంక్షేమం, అభివృద్ధి కంటే కార్యకర్తలకే అత్యధిక ప్రధాన్యత ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇలా కూటమినేతలకు వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.