2014 ఎన్నికల్లో ఓటమి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తీవ్రంగా కలచివేసింది. ఓటమి భారాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. వయసులో ఉన్నప్పుడంటే ఓపికగా అధికారం కోసం ఎదురుచూసిన ఆయన వయసు మీద పడటంతో అధికారం కోసం నాలుగేళ్లు ఆగలేకపోతున్నారు. అంటే ఇక్కడ నాలుగేళ్లు ఆగితే ఆయనకు సీఎం పీఠం దొరికేస్తుందని కాదు. ఎంత ఆశపడినా మళ్లీ ఎన్నికలు రావాలంటే ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే కదా. కానీ బాబుగారి వైఖరి చూస్తే ఆగలేకపోతున్నట్టున్నారు. జమిలి ఎన్నికలు లేదా ముందస్తు ఎన్నికలు వచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు వచ్చేస్తాయనే ధీమాతో ఉన్నారు. నిన్న అనంతపురం లోక్ సభ నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించిన ఆయన జమిలి ఎన్నికల మీద ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేనా ఎన్నికలకు సిద్దమైపోవాలని అన్నారు. ఈ మాటలు విని నవ్వాలో, బాబుగారి ఆత్రం చూసి జాలిపడాలో అర్థం కావట్లేదు.
పైకి లేవనేలేదు అప్పుడే ఎన్నికలా ?
క్రితం ఎన్నికల్లో వైఎస్ జగన్ టీడీపీని మామూలు దెబ్బ కొట్టలేదు. అలాంటి దెబ్బను చంద్రబాబు నాయుడు తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ తిని ఉండరు. తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానంలో అలాంటి కుదుపును చూసి ఉండదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు రాష్ట్రంలోని అన్ని మూలాల్లో టీడీపీ కోటకు బీటలు వారేలా చేశారు జగన్. ఆ బీటలకు పూతలు పూసుకునే పనే ఇంకా మొదలుపెట్టలేదు చంద్రబాబు. యేడాదికి పైగా గడిచినా ఇంకా పార్టీని పైకిలేపే చర్యలకు పూనుకోలేదు. అసలు ఇప్పటికీ గత ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణాలేమిటో విశ్లేషించుకోలేకపోతున్నారు దేశం నేతలు. ఎంతసేపూ జగన్రెడ్డిని గెలిపించి జనం తప్పు చేశారు, మూల్యం చెల్లించుకుంటారు అంటూ ప్రజా తీర్పును తప్పుబడుతున్నారు తప్ప జనం తమను షెడ్డుకు సాగనంపడానికి కారణం ఏమిటి, తాము చేసిన తప్పులేమిటి అని కాస్త కూడ ఆలోచించలేదు.
అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గాడి తప్పినా చక్కదిద్దే ప్రయత్నాలు లేవు. అసలు మంగళగిరి స్వయానా తన కుమారుడు, టీడీపీ భవిష్యత్ సారథి నారా లోకేష్ ఓడిపోవడానికి రీజన్ ఏంటో కనుక్కోలేకపోయారు. ఇప్పటికిప్పుడు టీడీపీకి కావాల్సింది ఎన్నికలు కాదు. ఆత్మవిమర్శ.. నిజాయితీతో కూడిన ఆత్మవిమర్శ. నిజాయితీ ఉంటేనే స్వయంకృతాపరాధాలను ఒప్పుకోకగల ధైర్యం వస్తుంది. అది టీడీపీలో మచ్చుకు కూడ కనిపించట్లేదు. ఏ నాయకుడూ కూడ పలానా పొరపాటు చేశాం, అందుకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అనడం ఇంతవరకూ ఎప్పుడైనా ఎవరైనా విన్నారా.. లేదే. ఎంతసేపూ మానకంటే ఎక్కువ ఖర్చు పెట్టారు గెలిచారు అనడం తప్ప ప్రజాతీర్పును గౌరవించిన పాపాన పోలేదు. అందుకే పడ్డ చోటే ఉన్నారు తప్ప పైకి లేవలేకపోతున్నారు.
ఉన్న 23 కూడ ఊడిపోతాయ్ :
అసలు జమిలి ఎన్నికలు, మధ్యంతర ఎన్నికల మీద బాగారికి ఎవరు ఉప్పందించారో అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం అవుతుందేమో. ఇంతలోనే ఎన్నికలు వస్తాయని ఆయన ఎలా ఆశిస్తున్నారో. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయనకు రాజ్యాంగం మేరకు 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయని తెలీదా. అసలు రాష్ట్రంలో నెలకొన్న జగన్ ప్రభుత్వం మీద ఏమంత వ్యతిరేకత ఉందని మధ్యంతర ఎన్నికలైనా రావడానికి. ప్రజలేమైనా ఉద్యమాలు చేస్తున్నారా జగన్ మాకొద్దని.. లేదు కదా. అప్పుడెప్పుడో జమిలి మాట వినడినా ప్రజెంట్ కేంద్రంలో ఎన్నికల ఊసే లేదు. పూర్తి కాల పరిమితిని వాడుకోవాలనే మోదీ సర్కార్ అనుకుంటోంది. ఇవన్నీ చూస్తూ కూడ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎలా అంటారు.
సరే బాబుగారి అత్యాశే నెరవేరి కేంద్రంలో ఏదేదో జరిగిపోయి ఎన్నికలే వచ్చాయనుకుందాం. ఆ ఎన్నికలకు ఆయన సిద్దంగా ఉన్నారా..? ఖచ్చితంగా లేరు. ఎక్కడా శ్రేణులు హుషారుగా లేవు. రేపటి రోజున పార్టీ కార్యక్రమం ఏంటని అడిగితే స్థానిక నేతలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు టక్కున సమాధానం చెప్పలేరు. వర్గపోరుతో విడిపోయిన తెలుగు తమ్ముళ్లు ఇంకా కలవలేదు. ఓడినా నాయకులు ఓటమి భారంలోనే ఉన్నారు. యాక్టివ్ దశలో ఉన్న యువ నాయకులను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. అసలు క్రితంసారి ఓడగోట్టిన ప్రజల్లోనే ఇంకా సానుభూతి కానీ నమ్మకం కానీ పుట్టలేదు. ఇంకొపక్క జగన్ సంక్షేమ పథకాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ఎన్నికలే వస్తే గెలవటం మాట అటుంచితే ఉన్న 23 ఎమ్మెల్యే సీట్లు కూడ ఊడటం ఖాయం. కనుక చంద్రబాబు నాయుడుగారు పగటి కలలు మాని పార్టీని పరిష్ట పరుచుకునే పనులేవైనా ఉంటే చేసుకోవడం మంచిది.