ఏపీలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడును జగన్ కంటే ఎక్కువగా ద్వేషించింది బీజేపీనే. బీజేపీ నాయకుల దృష్టిలో చంద్రబాబు అంటే అసలు నాయకుడే కాదని, టీడీపీ ఇక ఉండబోదనే అభిప్రాయం గట్టిగా ఉంది. అందుకే నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు చెలిమి చేద్దామని చెంతకు వస్తున్నా ఛీకొట్టారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబుతో కలిసేది లేదని, వచ్చే ఎన్నికల్లో తామే ప్రతిపక్షమని రేగిపోయారు. మొదట్లో చంద్రబాబు కూడ బీజేపీ నేతల మాటలకు పెద్దగా రియాక్ట్ కాలేదు. అవసరం తనది కాబట్టి మౌనంగానే అన్నీ భరించారు. ఒక్కో మెట్టు దిగుతూ పొత్తు కోసం ట్రై చేశారు. కానీ బీజేపీ నేతలు మాత్రం బాబు ఎంత దిగొస్తే అంత బెట్టు చేశారు.
దీంతో ఆయనకు కూడ చిరాకెత్తుకొచ్చింది. అందుకే ఒంటరిపోరుకు రెడీ అయ్యారు. అధికార పక్షం మీద ఈమధ్య కాలంలో ఆయన స్పందిస్తున్న తీరే అందుకు నిదర్శనం. ఎడాది కాలం ఇంట్లోనే గడిపేసిన ఆయన ఇప్పుడు ప్రతి విషయానికి బయటికొస్తున్నారు. పాలకవర్గం తప్పులను భూతద్దంలో వెతుకుతున్నారు. అన్నిటికీ మించి దేవాలయాలు, దేవుళ్ళ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. మొదట్లో అంతర్వేది రథం దగ్ధం, దుర్గ గుడిలోని వెండి సింహాలు మాయమవడం, ఇంకొన్ని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడం లాంటి విషయాల్లో నెమ్మదిగానే స్పందించారు. అప్పుడు బీజేపీ నేతల హడావుడి ఎక్కువగా ఉండేది. హిందూత్వ నినాదాన్ని పట్టుకుని రాజకీయం చేశారు.
జగన్ అన్యమతస్తుడని గుర్తుచేస్తూ హిందువులను గిల్లాలని చూశారు. కానీ బీజేపీ ఉద్దేశ్యాలను పసిగట్టిన జనం వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. పైగా మతవిద్వేషాలు రెచ్చగొట్టొద్దని రివర్స్ అయ్యారు. దీంతో డోస్ పెంచితే కానీ పని జరగదని భావించిన కమలదళం రామతీర్థం వివాదాన్ని పెద్దది చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రామతీర్థం కొండ మీదకు వెళ్లాలని ట్రై చేశారు. కానీ కుదరలేదు. చలో రామతీర్థం పేరుతో పెద్ద నిరసన కార్యక్రమం చేయాలని, జాతీయస్థాయికి తీసుకెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ఈలోపు చంద్రబాబు మంది మార్భలంతో రామతీర్థం కొండ మీద ప్రత్యక్షమయ్యారు. వైసీపీని ఎన్నడూ లేని విధంగా ఏకిపారేశారు.
చంద్రబాబు పర్యటన వైసీపీని ఇబ్బందుల్లో పెట్టిందో లేదో తేలీదు కానీ బీజేపీని మాత్రం ఖంగుతినేలా చేసింది. హిందూత్వం అంటే పేటెంట్ మాదే, ఆ విషయంలో ఏం చేసినా మేమే చేయాలి అన్నట్టు ఉండే బీజేపీకి చంద్రబాబు దూసుకొచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేసరికి దిక్కుతోచట్లేదు. వివాదంలో వేలుపెట్టి మంచి మైలేజ్ పొందాలనుకుంటే చంద్రబాబు ఆ పని చేసి తమను లేపి అవతల పడేశాడని తలపట్టుకుంటున్నారు. దీంతో కొత్త దారి వెతికి వైసీపీ, టీడీపీ రెండూ రామతీర్థం వివాదాన్ని రాజకీయం చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు హయాంలో 50 దేవాలయాలు కూల్చారని లెక్కలు చెబుతున్నారు.
మరి టీడీపీ చేస్తున్నది రాజకీయమే అయితే మనుగడ మొత్తంలో దేశవ్యాప్తంగా దేవాలయాలను, దేవుడిని, మతాలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేసింది ప్రజాపోరాటమవుతుందా. అదే పెద్ద మత రాజకీయం. రామతీర్థంలో కూడ అదే చేయాలనుకున్నారు. కానీ చంద్రబాబు వచ్చి తమను వెనక్కు నెట్టి హైలెట్ కావడంతో ఏం మాట్లాడాలో తేలీక కిందామీదా అయిపోతూ ఆయన మీద విమర్శలు మొదలుపెట్టారు.