రాజకీయాల్లో మాస్ ఇమేజ్ రావాలంటే జైలు నేపథ్యం తప్పనిసరి. జైలుకెళ్లిన నాయకులకు హీరోయిక్ ఇమేజ్ ఆపాదిస్తుంటారు మన ఓటర్లు. ఆ జైలుకెళ్లడం అనేది తప్పు చేసైనా కావొచ్చ తప్పు చేయకుండానే కక్షపూరిత రాజకీయాల మూలంగా అయినా కావొచ్చు. అయితే తప్పు చేసి వెళితే ఒక్కోసారి కెరీర్ నాశనమైపోవచ్చు కానీ కక్షపూరిత రాజకీయాల మూలాన జైలుకెళితే మాత్రం బోలెడంత సానుభూతి దక్కించుకోవచ్చు. సానుభూతి పవర్ అలా ఇలా ఉండదు. నేరుగా తీసుకెళ్లి సీఎం పీఠం మీద కూర్చోబెట్టేలా ఉంటుంది. అందుకు నిదర్శనమే వైఎస్ జగన్. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన ఆయన తనను కాంగ్రెస్ పార్టీ కావాలని కేసులు పెట్టి జైల్లో వేస్తే అందుకు చంద్రబాబు నాయుడు సహకరించారని అంటుంటారు.
ఆ నమ్మకాన్నే ప్రజల్లో కలిగించారు. ఆయన మీద ఆరోపించబడిన ఆర్ధిక నేరాలు ఇంకా విచారణ దశలో ఉన్నాయి కాబట్టి జనం సైతం జగన్ మీద సానుభూతి చూపించి ఒకసారి ప్రతిపక్షంలో రెండోసారి ఏకంగా అఖండ మెజారిటీతో అధికార పక్షంలో కూర్చోబెట్టారు. అందుకే చంద్రబాబు నాయుడు సైతం అదే ఫార్ములాను తన మీద ప్రయోగించుకోవాలని చూస్తున్నారట. జగన్ అంటే పరిస్థితుల ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరడం, జైలుకెళ్లడం జరిగాయి. కానీ చంద్రబాబుకు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్ని కల్పించుకోవాలనేది ఆయన ఆలోచనట. అందుకోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని వాడుకోవాలని చూస్తున్నారట.
ప్రస్తుతం ఆయన మనసులో బీజేపీతో జతకట్టి 2024 నాటికి బలపడి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే కోరిక ఉంది. కానీ బీజేపీ అందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే చాలా మెట్లు దిగిన బాబుగారు బీజేపీని ఎన్ని విధాలుగా ప్రసన్నం చేసుకోవాలో అన్ని విధాలుగా ట్రై చేశారు. కానీ బీజేపీ మనసు కరగడం లేదు. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు రివర్స్ గేర్ వేయబోతున్నారట. బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించి, రాష్ట్ర శాఖ మీద తిరుగుబాటు ప్రకటిస్తే బీజేపీ అధినాయకత్వానికి కోపం వస్తుందని, అప్పుడు తనను కేసులు పెట్టి జైలుకు పంపుతారని స్కెచ్ వేస్తున్నారట.
ఇక కేసుల మీద స్టేలు తెచ్చుకోవడం తనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జైల్లో కొన్నాళ్ళు ఉన్నా, తర్వాత బయటికిరావచ్చని, ఈలోపు జనంలో మోదీ చేతిలో అష్టకష్టాలు పడుతున్న వృద్ధ నేతగా సానుభూతి సాధించి బలం పుంజుకోవాలని, దాన్నే ఉధృతం చేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ పథకాన్నే గనుక ఆయన అమలుచేస్తే అనుకున్నట్టే సీఎం అవుతారో లేకపోతే మధ్యలో విఫలమై జైల్లోనే ఇరుక్కుపోతారో.