ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జగన్‌కు, కోర్టులకు జరుగుతున్న ముద్దానికి ఇంకొంత ఆద్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మొదటి నుండి కోర్టుల విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబుగారి వైఖరే. జగన్ ఏ అంశంలో కోర్టులకు వెళ్లినా అందులో వ్యతిరేక తీర్పులను ముందుగానే చంద్రబాబు పసిగట్టడం, మీడియా ముందుకొచ్చి చూడండి.. ఈ విషయంలో జగన్‌కు మొట్టికాయలు తప్పవు అంటూ జోస్యం చెప్పడం, తీరా కోర్టు తీర్పులు చూస్తే ఆయన చెప్పినట్టే జరగడంతో జగన్ ఈగో బాగా హర్ట్ అయింది. రంగుల జీవో, అమరావతి భూముల పంపకం వరకు అన్నిటిలోనూ బాబు కోరుకున్నట్టు, చెప్పినట్టే తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పులతో జగన్ బాగా నొచ్చుకున్నారు. మామూలుగా అయితే అంత బాధపడాల్సిన పనిలేదు కానీ తాను పడినందుకు కాదు కానీ పక్కనోడు నవ్వినందుకు ఎక్కువ అవమానం ఫీలైనట్టు జగన్ ఫీలైపోయారు.
ఆ ఫీలింగ్ మూలానే ఆయనలో చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలిగింది. జస్టిస్ ఎన్వీ రమణ పద్దతిని పరిశీలించి బెంచులకు కేసులను అలాట్ చేయడంలో తమకు వ్యతిరేక తీర్పులు వచ్చేలా వ్యవహరిస్తున్నారని అనుమానపడ్డారు. స్వర్ణ ప్యాలెస్ కేసులో డాక్టర్ రమేష్ కుమార్ ను విచారించవద్దని, అరెస్ట్ చేయవద్దని అనడం లాంటి తీర్పులతో ఆ అనుమానాలు ఇంకా బలపడ్డాయి. అందుకే చంద్రబాబు ఎన్వీ రమణ సహకారంతో కోర్టుల ద్వారా తన మీద దాడికి దిగుతున్నాడని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాడని వాదిస్తున్నారు. కేసులు, తీర్పులు, ఎన్వీ రమణ, చంద్రబాబు ఇలా విడివిడిగా చూస్తే అనుమానం రాకపోవచ్చు కానీ అన్నిటినీ కలిపి చూసినప్పుడు సామాన్యులకు సైతం ఇందులో చంద్రబాబు హస్తం ఏమైనా ఉందా అనే అనుమానం కలగలక మానదు. ఆ అనుమానమే జగన్‌లో కలిగింది.
అందుకే ఆయన నేరుగా ప్రధాన న్యాయమూర్తి ముందు పంచాయితీ పెట్టారు. ఒకవేళ జగన్ చేసింది నిజంగా తప్పే అయితే చంద్రబాబు అది ఎందుకు తప్పు అనేది వివరించి చెప్పాలి. తన సుధీర్ఘ రాజకీయ అనుభవంతో, న్యాయవ్యవస్థ పనితీరు పట్ల అవగాహనతో విశ్లేషణ జరిపి తప్పొప్పులను వివరించాలి. అంతేకానీ జగన్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సబబు అనేది ఆయనే ఆలోచించుకోవాలి. జగన్‌కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొందని, ప్రభుత్వం కూలుతుందని, అందుకు భయపడే కోర్టుల మీద దాడి అని మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్ మనసులో ఉద్దేశ్యం అదే అయితే నిదానంగా అదే బయటపడుతుంది.
అసలు బీజేపీ తనకు అవసరమైన, మద్దతుగా ఉన్న జగన్ పొరపాటు చేస్తూ జైలుకెళ్లే పరిస్థితే ఉంటే ఆపకుండా, నిలువరించకుండా ఉంటుందా. ఇప్పటికే ఎన్డీయే నుండి కొన్ని పార్టీలు బయటికి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ జగన్ తప్పటడుగు వేసి కుప్పకూలిపోయి తనకు పనికిరాకుండా పోతుంటే చూస్తూ మౌనంగా ఉంటారా. కాబట్టి జగన్ రిస్క్ అని తెలిసి కూడ న్యాయవ్యవస్థ మీదికి దూకాడంటే తన భద్రతలు, జాగ్రత్తలును చూసుకుని, కాపాడే శక్తులను ఏర్పాటు చేసుకునే దూకి ఉంటారు. అంతేతప్ప గుడ్డిగా అయితే ఊబిలో కాలుపెట్టరు కదా. జగన్‌కు 10 నుంచి 30 ఏళ్ల జైలు శిక్ష పడనుందని జడ్జీలకే జడ్జిలా బాబుగారు జడ్జిమెంట్ ఇవ్వడం, జమిలి ఎన్నికలు రానున్నాయని జోస్యం చెప్పడం చూస్తే జగన్ కళ్లుమూసుకుని నడవడం ఏమో కానీ చంద్రబాబు మాత్రం తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే రీతిలో కోర్టులను మేనేజ్ చేస్తున్నారని తనపై ఉన్న ఆరోపణలకు ఇంకాస్త బలాన్నిస్తున్నట్టు ఉంది.