AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం కూని అయింది అంటూ వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం చూసి ప్రజాస్వామికవాదులు నివ్వెర పోతారని మండి పడ్డారు. అధికార మదంతో మునిసిపాలిటీలలో మెజారిటీ లేకపోయినా దాడులకు దౌర్జన్యాలకు పాల్పడే అధికారం అందించుకోవాలని తెలుగుదేశం పార్టీ తాపత్రయపడుతోందని అందుకే ఇలా దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని జోగి రమేష్ తెలిపారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాలలో విలువలు లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. 2019 ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ కు మద్దతు తెలిపి తనని గెలిపించాలని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం అక్కడికి వెళ్లి అదే కేజ్రీవాల్ ను ఓడించాలి అంటూ బిజెపి తరఫున మాటలు మాట్లాడుతున్నారు.
అధికారం అందుకోవడం కోసం చంద్రబాబు నాయుడు కూడా మారిపోవటం ఆయనకున్న అలవాటు అంటూ రమేష్ మండిపడ్డారు. మున్సిపల్ ఉప ఎన్నికలలో భాగంగా ఎలాగైనా అధికారం అందుకోవాలని ఉద్దేశంతో వైకాపా నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు .ఇక తిరుపతిలో ఇటీవల వైకాపా వారు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడమే కాకుండా కొంతమందిని కిడ్నాప్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దౌర్జన్యాలకు, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని చంద్రబాబు చర్యల కారణంగా ప్రజలందరూ కూడా షాక్ లో ఉన్నారని జోగి రమేష్ తెలిపారు. ఏపీలో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం కాదని కుట్రల ప్రభుత్వం అంటూ ఈయన ప్రభుత్వ ధోరణిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.