Former Minister Jogi Ramesh Arrested: మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు – ఏపీ రాజకీయాల్లో నకిలీ మద్యం కేసు కలకలం!

Former Minister Jogi Ramesh Arrested: నకిలీ మద్యం తయారీ, విక్రయాల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ రోజు ఉదయం భారీ పోలీసు బలగాలతో సిట్ అధికారులు జోగి రమేశ్ ఇంటికి చేరుకున్నారు. తొలుత, ఆయన అనుచరుడైన రామును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఇంటి వద్ద నెలకొన్న హైడ్రామా నడుమ మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు. అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారికి అభివాదం చేస్తూనే జోగి రమేశ్ పోలీసు వాహనంలోకి ఎక్కారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్థనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేశ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్థనరావు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కీలక ఆధారంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అయితే, ఈ ఆరోపణలను జోగి రమేశ్ మొదటి నుంచి ఖండిస్తున్నారు. “ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.” “ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు.” “ఉద్దేశపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.” అని ఆయన గతంలోనే స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అరెస్టు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణలో తదుపరి పరిణామాలు, కోర్టులో ఏం జరుగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Kasibugga Stampede: Natti Kumar Gives Clarity | Telugu Rajyam