ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సత్య ప్రమాణం చేసి సంచలనం సృష్టించారు. కల్తీ మద్యం వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.
దుర్గ గుడిలో ప్రమాణం: కల్తీ మద్యం కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జోగి రమేష్ పాత్రపై విచారణ సాగుతున్న నేపథ్యంలో, తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని రమేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబంతో కలిసి దుర్గ గుడికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని, ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని ప్రమాణం చేశారు.
“కల్తీ మద్యం పేరుతో నా హృదయాన్ని గాయ పరిచారు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, చేయను” అని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై నింద వేసినందుకే కుటుంబంతో సహా వచ్చి, నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానని ఆయన తెలిపారు.

ప్రతిపక్షానికి సవాల్: తాను తిరుపతి వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి సిద్ధమని గతంలోనే చెప్పానని, ఆ సవాలుకు కట్టుబడే ఈ రోజు అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానని రమేష్ వెల్లడించారు. అంతేకాక, నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ కు కూడా తాను సిద్ధమని ప్రకటించారు.
“నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?” అని జోగి రమేష్ ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారు సత్యప్రమాణానికి సిద్ధమా? పోనీ.. లై డిటెక్టర్ టెస్టుకైనా వస్తారా? అంటూ కనక దుర్గమ్మ సాక్షిగా తనపై ఆరోపణలు నిరూపించాలని ఆయన మరోమారు సవాల్ విసిరారు. తన కుటుంబాన్ని అవమానపరిచి, హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నట్లు ఆయన వివరించారు.

