చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్: సజ్జలదీ అదే నినాదం.!

Chandrababu Direction : పాడిందే పాడరా.. పాచిపళ్ళ డాష్ డాష్.! అని వెనకటికి ఓ బలమైన మాట వుంది. అధికార వైసీపీ నేతల తీరు కూడా అలాగే తయారయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చాలా బలంగా వుందని ఆ పార్టీ ఇంకా బలంగా నమ్ముతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే, 2024 ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలోనూ గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇంత ధీమా వున్నప్పుడు, విపక్షాల కలయికపై అధికార వైసీపీకి ఎందుకు అంత అసహనం.? చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్.. అంటూ పాత పల్లవి అందుకుంది వైసీపీ. అది నిజమే కావొచ్చు.. దాని వల్ల వైసీపీకి వచ్చే నష్టమేముంది.? వైసీపీ తీరు చూస్తోంటే, టీడీపీ – బీజేపీ కలయికతో వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమన్న అభిప్రాయం జనానికి కలుగుతోంది.

ఎన్నికలు, ఓట్లు.. ఇదంతా ఓ మ్యాజిక్. అప్పటికి వున్న వేవ్‌ని బట్టి ఈక్వేషన్స్ వున్నపళంగా మారిపోతుంటాయి. టీడీపీ – జనసేన కలిస్తే ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందన్న భావన వైసీపీనే కలగజేస్తోంది. అలా వైసీపీ నేతలు చేస్తున్న పనుల వల్ల వైసీపీకే నష్టం కలిగే అవకాశం వుంది.

చోటా మోటా నాయకులతో నాలుగు విమర్శలు టీడీపీ, జనసేన మీద చేయిస్తే సరిపోయేదానికి, ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కావొచ్చు, వైసీపీ మంత్రులు కావొచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావొచ్చు.. ఇంతమంది, పవన్ కళ్యాణ్ విషయమై కంగారు పడుతున్నారంటే, దానర్థమేంటి.?

వైసీపీకి బోల్డంతమంది సలహాదారులున్నారు, వాళ్ళెవరూ అధిష్టానానికి సరైన సలహాలు ఇవ్వడంలేదేమో.! 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటే, ఆ పొత్తుకి సాయం చేసింది వైసీపీనే అవుతుంది. ఆ రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే, అది కూడా వైసీపీ పుణ్యమే అవుతుంది.