తెలిసో తెలియకో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మద్ధతిచ్చి అతన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ కి సీన్ అర్ధమైంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు నాయకులు అనేవారు! ఎలా ఉంటారు అన్నది బాగా అవగతంలోకి వచ్చింది. పాలన విషయంలో పవన్ సూచనలు, సలహాలు చంద్రబాబు లైట్ తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగాను అసలు రాజకీయం అనేది ఇలా ఉంటుందా? అని ఓ క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు అండ్ కో మీదకి డైరెక్ట్ గా దాడికి దిగాడు. ఆ పై పచ్చ తమ్ముళ్లతో స్నేహాన్ని తెంచేసుకుని బయటకు వచ్చేసారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే.
ఆ తర్వాత జనసేనాని బీజేపీ తో కలిసి ప్రయాణం మొదలు పెట్టారు. పాచిపోయిన లడ్డులని మోదీని ఎద్దేవా చేసిన పవన్ ఆ తర్వాత పూర్తిగా స్వరం మార్చేసి ఏపీ బీజేపీకి బలమైన పునాదిగా మారారు. అమరావతి విషయంలో మొదట ఏకపక్ష వైఖరిని ప్రదర్శించినా తర్వాత అతను ప్లేట్ ఫిరాయించారు. అదిష్టానం మనసులో ఏముందో? కాస్త తొందరగానే పసిగట్టి అదే అమరావతి విషయంలో ద్వంద వైఖరినీ ప్రదర్శించడం మొదలు పెట్టారు. మూడు రాజధానులను పూర్తిగా సమర్ధించలేక..ఒక రాజధాని ముద్దు అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. అలా కొన్ని అంశాల్లో పవన్ అభిప్రాయాల్లో కొట్టొచ్చినట్లు కనిపిచింది.
ఇప్పుడు అమరావతి రైతులకు న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నారు తప్ప! మూడు రాజధానులు వద్దు అన్న మాట బలంగా చెప్పలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ఒంటరి అయిపోయినట్లు కనిపిస్తోంది. మూడు రాజధానుల విషయంలో వైసీపీ, బీజేపీ, జనసేన ఒకేతాటి మీద ఉన్నట్లు తేలిపోయింది. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైనా టీడీపీ ఒంటరిపోరాటం చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దూరమాయే. దీంతో చంద్రబాబు కి ఇది కాస్త కంగారు పెట్టే విషయమే.