రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది చాలా సహజమైన చర్య. అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెతుక్కుంటూ వెళ్లడం కొందరు రాజకీయ నాయకుల నైజం. ఈ నైజం ఒకటి, రెండు లేదా మూడుసార్లు ప్రదర్శించినా జనం చూసి చూడనట్టు వదిలేస్తారేమో కానీ అదే పనిగా పార్టీల గోడలు దూకుతూ ఉంటే ఊరుకుంటారా. తోచినప్పుడల్లా కండువా మారిస్తే ఆదరిస్తారా.. లేదు కదా. అసలు అన్ని పార్టీలు మారుతూ వెళితే పార్టీల్లో కూడ వారికి విలువ ఉండదు. సరిగ్గా ఇలాగే ఉంది నరసాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు పరిస్థితి. ఎప్పటికప్పుడు పార్టీలు మారుతూ వెళ్ళే ఆయనకు ఏ పార్టీలోనూ విలువ లేకుండా పోయింది.
తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సుబ్బారాయుడు 2004 లో టీడీపీ టికెట్ మీద నరసాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తామన్నా కాదని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో అందులోకి దూకి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్లారు. జగన్ ముదునూరు ప్రసాదరాజును కాదని మరీ ఆ ఎన్నికల్లో సుబ్బారాయుడుకు టికెట్ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ నెగ్గింది. ఇక ఆయన మనసు ఉండబట్టలేక టీడీపీకి జంప్ కొట్టారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ట్రీట్మెంట్ ఆయనపై బాగా పనిచేసింది.
టికెట్ ఇస్తాను ఇస్తాను అంటూనే 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవ నాయుడుకే అవకాశం ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న సుబ్బారాయుడు హుటాహుటిన వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు కూడ. కానీ జగన్ నమ్మిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచరు కాబట్టి ప్రసాదరాజును పక్కనపెట్టి సుబ్బారాయుడుకు టికెట్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. పైపెచ్చు ప్రసాదరాజు నాయకుడిగా నియోజకవర్గంలో బలంగా కుడురుకుని ఉన్నారు. అందుకే ఈసారి కూడ సుబ్బారాయుడుకు టికెట్ దొరకదు. ఈ సంగతి తెలిసినా తన ప్రయత్నం ఏదో తాను చేస్తున్నారు. కానీ జగన్ వచ్చే ఎన్నికలకు ముందు ఒట్టి చేతులు ముందుపెడితే సుబ్బారాయుడు చేయగలిగింది ఏమీ లేదు. చేస్తే గీస్తే ఆయన ఇప్పటివరకు వేలు పెట్టని జనసేన పార్టీలోకి వెళ్లడం తప్ప. అదే జరిగితే ఆంధ్రాలోని ప్రధాన స్థానిక పార్టీలన్నింటికీ టచ్ చేసిన రికార్డ్ సుబ్బారాయుడికే దక్కుతుంది.