ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. నిమ్మగడ్డ ఏమాత్రం తగ్గడం లేదు.. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. రెండు వైపులా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. మొండిగా వ్యవహరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తమ పరిధులు దాటుతున్నారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఒక అధికారి. అది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి. కానీ.. ఆ పదవిలో ఉండి.. రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారు నిమ్మగడ్డ.. అంటూ ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ఎందుకింత సీన్ చేస్తున్నారు అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం నుంచి ఇదే తంతు. ఏపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా.. ఆయనకు ఆయనే చాలాసార్లు నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయలో ఆయన మాట వినడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే.. మార్చిలో నిమ్మగడ్డ పదవీ విరమణ ఉండటం వల్ల.. కావాలని తను రిటైర్ అయిపోయేలోపు ఎన్నికలు నిర్వహించి.. తన సత్తా చాటాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. తాను పదవి విరమణ చేస్తే.. ఎన్నికలను ఎందుకు హడావుడిగా నిర్వహించడం అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
నిమ్మగడ్డ మీద ఏపీ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. ఆ పార్టీ నేతలు చెప్పినట్టుగా చేస్తూ.. ఎన్నికల విషయంలో ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని.. వైసీపీ కూడా ఆరోపణలు చేస్తోంది.
ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? లేక ప్రభుత్వం మరోసారి సుప్రీం తలుపులు తట్టి.. దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.