ప్రధాని నరేంద్ర మోడీ అతి త్వరలో క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారన్న ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతోంది. ముహూర్తం దాదాపు ఖరారయ్యిందనీ, బుధవారమే ఈ విస్తరణ వుండబోతోందంటూ ఊహాగానాలు మరింత జోరుగా సాగుతున్నాయి.
ఈ మేరకు ఢిల్లీ వర్గాల నుంచి లీకులూ అందుతున్నాయి. ఎవరికి కేంద్ర క్యాబినెట్‌లో కొత్తగా బెర్త్ దక్కనుంది.? అన్నదానిపై వినిపిస్తున్న ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు.
జాతీయ స్థాయిలో ఎవరెవరు కొత్తగా ఛాన్స్ దక్కించుకోబోతున్నారు.? ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో వున్నవారిలో ఎంతమందికి డిమోషన్ లభిస్తుంది.? ఎంతమందికి ప్రమోషన్ లభిస్తుంది.? ఎవరికైనా ఉద్వాసన జరుగుతుందా.? ఇలా బోల్డన్ని చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణ నుంచి కొత్తగా ఎవరో ఒకరికి బెర్త్ దక్కవచ్చునని అంటున్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభిస్తుందట.. క్యాబినెట్ ర్యాంక్ ఆయనకు దక్కనుందట. అయితే, రెండో వ్యక్తి ఎవరు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోపక్క, ఆంధ్రపదేశ్ నుంచి కొందరు బీజేపీ సీనియర్లు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
అందులో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒకరు. కానీ, ఆయనకు ఆ అవకాశం దక్కడం కష్టమే. ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప, బీజేపీ నుంచి ఏపీ తరఫున కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కష్టమే. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అవబోతున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది నిన్నమొన్నటిదాకా.
అయితే, ఈ వ్యవహారంపై జనసేన శ్రేణులు పెదవి విప్పడంలేదు. ఏమాత్రం అవకాశం వున్నా, జనసైనికుల హంగామా ఇంకో స్థాయిలో వుండేదే. నిజానికి, జనసైనికులు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కేంద్ర మంత్రిగా చూడాలనుకోవడంలేదు.
కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే, బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయినట్లవుతుందన్నది వారి ఆవేదన. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. జనసేన అధినేత మాత్రం, అమరావతి టూర్ ఖరారు చేసుకున్నారు.. అదీ చాలాకాలం తర్వాత ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళబోతున్నారు.