చంద్రబాబు వలపు బాణానికి జనసేనాని పవన్ స్పందన ఎలా వుంటుంది.?

CBN’s Valapu Baanam : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈసారి ఇంకాస్త గట్టిగా వలపు బాణాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు సంధించారు. ఈ సారి బాణానికి ‘త్యాగం’ అని కూడా పేరు పెట్టారు. అంటే, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తున్నట్లేనా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వుంటే, దానికి టీడీపీ అంగీకరిస్తే.. మాకూ అభ్యంతరం లేదు.. అని గతంలోనే బీజేపీ ప్రకటించిన విషయం విదితమే.

కానీ, అందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయ్. చంద్రబాబు వలపు బాణాన్ని అనేక ఈక్వేషన్స్ వేసుకుని మరీ సంధించేశారు.

సాధారణ ఎన్నికలు 2024లో జరగాల్సి వుండగా, అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అక్కడికేదో ఆర్నెళ్ళలోనో, ఏడాదిలోనో ఎన్నికలు జరిగిపోతాయన్నట్టుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు, కీలకమైన వలపు బాణాన్ని జనసేన మీదకు సంధించేశారు.

ఇప్పుడీ వ్యవహారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వుంది. అయితే, చంద్రబాబు రాకీయంగా తలపండిన వ్యక్తి. పవన్ గనుక తొందరపాటుతో స్పందిస్తే అది టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌కి జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పూసగుచ్చి మరీ వివరించారట.

కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు జనంలోకి పవన్ వెళ్ళనున్న దరిమిలా, ఆయన మీడియాని ఫేస్ చేయక తప్పదు. చంద్రబాబు ప్రతిపాదనపై టీడీపీ అనుకూల మీడియా రకరకాలుగా నిలదీస్తుంది. వైసీపీ మీడియా సంగతి సరే సరి. మరి, పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు.? వేచి చూడాల్సిందే.