కక్ష్య పూరిత రాజకీయాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధినేతలు వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చెయ్యగా, ఇప్పుడు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అధినేతలు టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకులకు ప్రజల ప్రయోజనాల కంటే కూడా తమ పగలు, కక్ష్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల అధినేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడంలో పెట్టిన శ్రద్దలో పదవ వంతు ప్రజల కష్టాలను, ఇబ్బందులను పరిష్కరించడంలో పెట్టి ఉంటే అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండేది.
టీడీపీని తిడుతున్న వైసీపీ నాయకులు
టీడీపీ-వైసీపీ నాయకుల గొడవలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా కొనసాగుతున్నాయి. వర్షాకాల సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ఈ వైసీపీ నాయకులు అక్కడ ప్రజల సమస్యల కోసం ప్రస్తావించకుండా టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రాజధాని భూముల అవినీతి, ఫైబర్ గ్రిడ్ అవినీతి అంశాలను సీబీఐ చేత విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. నిజానికి అధికారంలో ఉన్నది వైసీపీనే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరితే కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం జాతీయ స్థాయిలో టీడీపీ, చంద్రబాబు పరువును తీసేందుకే ప్రయత్నించింది. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా కేంద్రం ప్రతిపాదించే అన్ని బిల్లులకూ మద్దతు తెలిపింది.
వైసీపీని తిడుతున్న టీడీపీ
2014 వరకు వైసీపీ నేతలను ఇష్టమొచ్చినట్టు ఆడుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు వైసీపీ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. 2014 వరకు తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వైసీపీ నాయకులను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇలా చీప్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో ఇంకా చులకనఅవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యాలో అర్ధం కాక టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కరోనా విషయంలో వైసీపీ విఫలమైందని పసలేని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పరువు తీసుకుంటున్న ఈ నేతలు ఢిల్లీ స్థాయిలో కూడా తమ పరువును తామే తీసుకుంటున్నారు. అయినా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ పరువు గురించి చర్చించడం అనవసరం.